![]() |
![]() |

ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. ఆగస్టు 29న గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ తరపున దర్శక నిర్మాత వై.వి.ఎస్. చౌదరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిడుగు వెంకటరామమూర్తితో పాటు తెలుగు భాష పట్ల ఎంతో ప్రేమ చూపించిన నందమూరి తారక రామారావు, నందమూరి హరికృష్ణలను గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ లో ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష పట్ల ఈ తరం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గత వైఎస్ జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు బోధనను తీసివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేసిన సాయి మాధవ్.. వారి తీరుపై విరుచుకుపడ్డారు. "పాఠశాలల్లో తెలుగు బోధన అవసరంలేదని అన్నవాళ్ళని, అది కరెక్టే అని సపోర్ట్ చేసిన వాళ్ళని చూశాం. బతుకుదెరువుకి తెలుగు పనికిరాదు అని కొందరు అంటున్నారు. తెలుగు భాష బతుకుదెరువు కాదు.. మన బతుకు. ముసలితనం వచ్చిందని అమ్మని బయటకు పంపిస్తామా?.. తెలుగు అమ్మ లాంటిది.. అమ్మని దూరం చేసుకోకూడదు. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో మాతృ భాషలో బోధన లేదని చెప్తే.. 24 గంటల్లో ఏం జరుగుతుందో మనకి తెలుసు. తెలుగు వారికి తప్ప మిగతా వారందరికీ వాళ్ళ భాష అంటే అంత ఇష్టం. పిల్లలు తెలుగులో మాట్లాడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కొడుతున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మారాలి. పిల్లలు తెలుగులో మాట్లాడేలా చేయాలి." అంటూ సాయి మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
![]() |
![]() |