Home  »  News  »  'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ

Updated : Aug 29, 2024

తారాగణం: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె.సూర్య, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్, అభిరామి గోపీకుమార్, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శివాజీరాజా తదితరులు
సంగీతం: జేక్స్‌ బిజోయ్‌
డీఓపీ: జి. మురళి 
ఆర్ట్: జి. ఎం. శేఖర్
స్టంట్స్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ 
నిర్మాత: డి.వి.వి. దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డి.వి.వి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: ఆగస్టు 29, 2024 

'అంటే సుంద‌రానికీ' వంటి రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram). ప్రచార చిత్రాలతో ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పైగా 'దసరా', 'హాయ్ నాన్న' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత నాని నటించిన సినిమా కావడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. నేడు థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలా ఉంది? 'అంటే సుంద‌రానికీ' చిత్రంతో ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయిన నాని-వివేక్ కాంబో 'సరిపోదా శనివారం'తోనైనా విజయాన్ని అందుకోనుందా? 'దసరా', 'హాయ్ నాన్న' బాటలో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని, నాని హ్యాట్రిక్ కొట్టనున్నాడా? అనేవి రివ్యూలో తెలుసుకుందాం. (Saripodhaa Sanivaaram Review)

కథ:
సూర్య(నాని) చిన్నతనం నుంచే కోపధారి మనిషి. ఎవరి వల్లయినా తనకి గానీ, ఇతరులకు గానీ బాధ కలిగితే సహించలేడు. కోపంతో ఊగిపోతాడు. ఎంత వేగంగా కోపం తెచ్చుకుంటాడో, అంతే వేగంగా వారిని కొట్టి ఆ కోపాన్ని తీర్చుకుంటాడు. అనారోగ్యంతో చావుకి దగ్గరైన సూర్య తల్లి.. కొడుకు కోపం చూసి ఆందోళన చెందుతుంది. ఆ కోపం వల్ల భవిష్యత్ లో తన కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడతాడోనని భయపడుతుంది. అందుకే చనిపోయేముందు కొడుకు దగ్గర ఒక మాట తీసుకుంటుంది. అదేంటంటే, వారంలో ఒక్కరోజు మాత్రమే కోపాన్ని ప్రదర్శించాలని చెబుతుంది. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం, శనివారం మాత్రమే సూర్య తన కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు. వారం మొత్తంలో తనకి కోపం రావడానికి కారణమైన వాళ్ళ పేర్లు డైరీలో రాసుకునే సూర్య.. శనివారం వచ్చాక కూడా వారిపై కోపం అలాగే ఉంటే.. అప్పుడు వారి లెక్క తేలుస్తాడు. తనకి కోపం వస్తే.. తనకి సంబంధం లేని వాళ్ళని కూడా తనవాళ్లు అనుకొని, వాళ్ళ తరపున నిలబడి.. కోపానికి కారణమైన వారికి బుద్ధి చెప్తాడు. మరోవైపు సిఐ దయ(ఎస్.జె.సూర్య) ఉంటాడు. అతనికి దయ అనేదే ఉండదు. సొంత అన్నని చంపడానికి కూడా వెనుకాడడు. కోపమొస్తే అమాయకులైన సోకులపాలెం గ్రామ ప్రజలపై తన ప్రతాపం చూపిస్తుంటాడు. అలాంటి దయ పేరుని సూర్య తన డైరీలో రాసుకుంటాడు. అసలు దయపై సూర్యకి కోపం రావడానికి కారణమేంటి? దయ లాంటి రూత్ లెస్ కాప్ ని శనివారం మాత్రమే శివతాండవం చేసే సూర్య ఎలా ఎదుర్కొన్నాడు? సోకులపాలెం ప్రజల కోసం సూర్య ఏం చేశాడు? ఇందులో సాయి కుమార్, ప్రియాంక మోహన్, మురళి శర్మ పాత్రలేంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ:
తెలుగులో వచ్చిన మేజర్ కమర్షియల్ సినిమాలను గమనిస్తే.. ఒక ప్రాంతం లేదా ఒక ఊరు కౄరుడైన విలన్ చేతిలో నలిగిపోతుంటుంది. భయంతో ఆ విలన్ కి ఎదురుతిరగలేక.. చిత్రహింసలను భరిస్తూ ఉంటారు ప్రజలు. అప్పుడు హీరో వచ్చి.. ఆ ప్రజలకు అండగా నిలబడి, వారి తరపున పోరాడి.. విలన్ కి బుద్ధి చెప్తాడు. 'సరిపోదా శనివారం' కూడా ఇంచుమించు అదే తరహా కథతో రూపొందింది. అయితే ఇందులో హీరో శనివారం మాత్రమే ఎదురుతిరుగుతాడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ, మళ్ళీ రొటీన్ కథని అల్లుకొని.. మొదలు, మలుపు, పీటముడి, దాగుడుమూతలు, ముగింపు అంటూ ఇలా పలు చాఫ్టర్లుగా విభజించి తనదైన స్క్రీన్ ప్లేతో సినిమాని గట్టెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు వివేక ఆత్రేయ. 

హీరో చైల్డ్ ఎపిసోడ్స్ తో సినిమా ప్రారంభమవుతుంది. హీరో శనివారం మాత్రమే కోపం ప్రదర్శించడానికి కారణమేంటో స్టార్టింగ్ లోనే చూపించారు. హీరో పెద్దయ్యాక అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంది? తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు.. సూర్య శనివారం కోపం ముదిరి.. అతనికి, అతని కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? వంటి సన్నివేశాలు చూపిస్తూ.. ఆ తర్వాత దయ పాత్రను పరిచయం చేశారు. అయితే ఇలా పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. సింపుల్ గా వాయిస్ ఓవర్ తో పాత్రలను, వాటి తీరుని పరిచయం చేయాల్సింది పోయి.. అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా మరీ డిటైల్డ్ గా చెప్తూ ల్యాగ్ చేశాడు. సన్నివేశాలు బాగున్నప్పటికీ ల్యాగ్ కారణంగా.. ఇంటర్వెల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఇంటర్వెల్ బ్లాక్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే, సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంది. సెకండాఫ్ స్టార్టింగ్ లో వచ్చే ఎస్.జె. సూర్య, మురళి శర్మ ట్రాక్ వినోదాన్ని పంచుకుంది. ముఖ్యంగా ఎస్.జె. సూర్య రోల్ మ్యాజిక్ చేసింది. హీరో నానిని డామినేట్ చేసేలా అతని రోల్, యాక్టింగ్ ఉన్నాయని చెప్పవచ్చు. పతాక సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే ఉంటాయి.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ తన లేజీ నేరేషన్ తో.. 150 నిమిషాల లోపు చెప్పాల్సిన కథని, దాదాపు 20-30 నిమిషాల అదనపు నిడివితో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు. ఎడిటర్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయితే.. కనీసం 20-30 నిమిషాలు ట్రిమ్ అయ్యి, ఇప్పుడున్న దానికంటే మెరుగైన అవుట్ పుట్ వచ్చి ఉండేది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ లేకపోవడం మరింత మైనస్ అయింది. రెగ్యులర్ సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ లేకుండా మూడు గంటలపాటు ప్రేక్షకులను కూర్చోబెట్టాలంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కట్టిపడేసే సన్నివేశాలతో.. నిడివి గురించి ఆలోచనే రాకుండా చేయగలగాలి. కానీ ఆ విషయంలో దర్శకుడు చేతులెత్తేశాడు.

సాంకేతికంగా చూస్తే, జేక్స్‌ బిజోయ్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. కొన్ని చోట్ల బాగానే ఉన్నప్పటికీ, చాలా చోట్ల లౌడ్ గా అనిపించింది. జి. మురళి కెమెరా పనితనం ఆకట్టుకుంది. సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఫ్రేమింగ్, లైటింగ్ ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
ఏ పాత్ర చేసినా అందులో ఇట్టే ఒదిగిపోయే నాని.. సూర్య పాత్రతో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. వారంలో ఆరు రోజుల పాటు సామాన్యుడిలా ఉంటూ.. ఒక్కరోజు మాత్రం అన్యాయాన్ని ఎదిరించి, సామాన్యులకు అండగా నిలబడే సూపర్ హీరో తరహా పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశాడు. ఇక దయలేని ఇన్ స్పెక్టర్ దయ పాత్రలో ఎస్. జె. సూర్య రెచ్చిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆ క్యారెక్టర్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఓ రకంగా నానిని డామినేట్ చేశాడని చెప్పవచ్చు. ఇక కానిస్టేబుల్ చారులత రోల్ లో ప్రియాంక మోహన్ పర్లేదు అనిపించుకుంది. గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆమెకి పెద్దగా స్కోప్ లేదు. సూర్య తండ్రిగా సాయి కుమార్, దయ అన్నగా మురళీ శర్మ ఎప్పటిలాగే తమ మార్క్ చూపించారు. శుభలేఖ సుధాకర్, అజయ్, అభిరామి, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శివాజీరాజా తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా...
శనివారం మాత్రమే హీరో కోపాన్ని ప్రదర్శిస్తే ఎలా ఉంటుందనే కొత్త పాయింట్ ని తీసుకొని.. దాని చుట్టూ రొటీన్ కథని అల్లుకొని, దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు. నాని అభిమానులు ఈ సినిమా చూసి నిరాశ చెందే అవకాశముంది. ఎందుకంటే నాని కంటే ఎస్.జె. సూర్యనే ఎక్కువ హైలైట్ అయ్యాడు. సాధారణ ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు. అంచనాలతో వెళ్తే ఖచ్చితంగా నిరాశచెందుతారు.

రేటింగ్: 2.5/5

- గన






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.