![]() |
![]() |
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ముఫాసా : ది లయన్ కింగ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. కొంతకాలంగా ఈ సినిమాలోని ముఫాసా పాత్రకు సూపర్‌స్టార్ మహేష్ డబ్బింగ్ చెప్పబోతున్నారు అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే ముఫాసాగా తన గొంతు వినిపించారు మహేష్. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు చాలా సినిమాలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, పూర్తి స్థాయిలో ఒక పాత్రకు మహేష్ డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం రూపొందింది. 2016లో వచ్చిన ‘ది జంగిల్ బుక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జాన్ ఫేవ్‌రీ ‘ది లయన్ కింగ్’ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రాన్ని మాత్రం బ్యారీ జెన్‌కిన్స్ డైరెక్ట్ చేశారు. అసలు ‘ది లయన్ కింగ్’, ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రాల కథాంశం, ఈ ప్రీక్వెల్‌కి ఉన్న ప్రాధాన్యం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.
సినిమా మార్కెట్ విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఏ భాషలో నిర్మించిన సినిమా అయినా ప్రపంచంలోని ఎన్నో భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయా భాషల్లో ప్రముఖ నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ సంప్రదాయం ఇండియాలో ఎక్కువైందనే చెప్పాలి. 2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించి కాసుల వర్షం కురిపించింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. నాని, జగపతిబాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ, షేకింగ్ షేషు వంటి నటులు సినిమాలోని ప్రధాన పాత్రలకు తమ గాత్రాన్ని అందించి సినిమాకి ఒక కొత్త లుక్‌ని తీసుకొచ్చారు. ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న భావన కలగకుండా ఎంతో సహజంగా వారు చెప్పిన డైలాగులు ప్రతి ఒక్కరినీ అలరించాయి, సినిమాలో లీనమయ్యేలా చేశాయి. ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జూలై 5న రిలీజ్ కావాల్సింది. కానీ, అమెరికన్ యాక్టర్స్ యూనియన్ మూడు నెలలపాటు సమ్మె చెయ్యడం వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది.
కథ విషయానికి వస్తే.. ‘ది లయన్ కింగ్’ చిత్రంలో అడవికి రాజైన ముఫాసా, రాజ్యాధికారం కోల్పోయి ఓ అనామకుడిలా బ్రతుకును వెళ్ళదీస్తున్న స్కార్ మధ్య కథ సాగుతుంది. ముఫాసాకు వెన్నుపోటు పొడిచి, అతని కొడుకు సింబాను రాజ్యం నుంచి తరిమేస్తాడు స్కార్. ఆ తర్వాత కొన్ని అరాచక శక్తులతో చేతులు కలిపి రాజ్యాన్ని అల్లకల్లోలం చేస్తుంటాడు. చివరికి ముఫాసా కొడుకు సింబా వచ్చి స్కార్‌కి బుద్ధి చెప్పి రాజ్యాన్ని చేజిక్కించుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ‘ముఫాసా : ది లయన్ కింగ్’ ఆ చిత్రానికి ప్రీక్వెల్.
టాకాగా పిలవబడే స్కార్ ఒక యువరాజు. దారి తప్పి వచ్చిన ముఫాసాను టాకా రక్షిస్తాడు. అతన్ని తన వెంట రాజ్యానికి తీసుకెళ్తాడు. టాకా ఆ అడవికి కాబోయే రాజు అయినప్పటికీ తర్వాతి కాలంలో ముఫాసా రాజవుతాడు. అది ఎలా జరిగింది, ముఫాసా రాజు కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేది కథ. ‘ది లయన్ కింగ్’ చిత్రంలో సింబా పాత్రకు నాని వాయిస్ ఎంత పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యిందో.. ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రంలో ముఫాసా పాత్రకు మహేష్ వాయిస్ అంత అద్భుతంగా కుదిరింది. ఇప్పుడీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా మహేష్ తన స్పందనను తెలియజేస్తూ ‘మనకు తెలిసిన, మనం ఇష్టపడిన పాత్రకు ఇదొక కొత్త కోణం. తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు వాయిస్ ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇది నాకు ఒక స్పెషల్ అని చెప్పగలను’ అంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ బాగా వైరల్ అవుతోంది. ఒక హాలీవుడ్ సినిమాలా కాకుండా జంతువులు ప్రధాన పాత్రల్లో ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించడమే ఈ సినిమా ప్రత్యేకత. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే ఇండియాలో మాత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.
![]() |
![]() |