![]() |
![]() |
తెలుగువారు హాస్యప్రియులు.. ఇది మనకు మాత్రమే దక్కిన ఓ వరం అని చెప్పొచ్చు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా.. ఇలా ఏ ప్రాంతం వారైనా మాట్లాడే విధానంలో ఒక శైలి ఉంటుంది. దానితోనే అంతులేని హాస్యాన్ని పుట్టించగల సత్తా తెలుగువారికి ఉంది. పాతతరం సినిమాల్లో హాస్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. కథ ఎలాంటిదైనా, కథనం ఎలా ఉన్నా.. హాస్యానికంటూ కొన్ని ప్రత్యేకమైన పాత్రల్ని సృష్టించేవారు. తద్వారా ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని అందించేవారు. తర్వాతికాలంలో కొందరు దర్శకులు హాస్యానికి పెద్ద పీట వేశారు. ఒకప్పుడు ఒక ట్రాక్‌గానే ఉన్న కామెడీని ప్రధానంగా తీసుకొని విజయవంతమైన సినిమాలు తీశారు. జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఇ.వి.వి.సత్యనారాయణ వంటి దర్శకులు కామెడీనే ప్రధానాంశంగా తీసుకొని దానికి తగ్గట్టుగానే కథలు రాసుకునే వారు. అలా రెండు దశాబ్దాలపాటు కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు.
ప్రపంచంలో ఏ చిత్ర పరిశ్రమకీ లేని ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకి ఉంది. అదేమిటంటే.. ఒక దశలో తెలుగు ఇండస్ట్రీలో 40 మంది కమెడియన్లు ఉండేవారు. దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. తెలుగువారికి హాస్యం అంటే ఎంత ఇష్టమో. పైగా ఆ కమెడియన్స్ అందరూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. వారిలోని టాలెంట్‌ని ఉపయోగించుకునే డైరెక్టర్లు కూడా ఆరోజుల్లో ఉన్నారు. అయితే కాలక్రమేణా సినిమాల నిర్మాణంలో మార్పులు వచ్చాయి. కొందరు కమెడియన్స్ కూడా కన్నుమూశారు. ప్రస్తుతానికి వస్తే.. హాస్యం స్థానంలో హింస రాజ్యమేలుతోంది. హింసను తెరపై చూపించి ప్రేక్షకుల్ని ఆందోళనకు గురి చేయమని ఎవరూ చెప్పలేదు. అయినా దాన్నే ప్రధానంగా తీసుకొని సినిమాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. హాస్యాన్ని పక్కన పెట్టేశారు. అడపా దడపా కొందరు దర్శకులు పూర్తి స్థాయి కామెడీ సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, గతంలో వచ్చినంత ఆరోగ్యకరమైన హాస్యం ఈ తరహా సినిమాల్లో కనిపించడం లేదన్నది వాస్తవం.
ఇప్పుడున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు సినిమాల్లో భారీతనం ఉంటే చాలు అనే ధోరణిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. గతంలో మాదిరిగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకప్పుడు సినిమా మాత్రమే వినోద సాధనంగా ఉండేది. ఇప్పుడు రకరకాల మాధ్యమాల ద్వారా వినోదం ప్రేక్షకుల చేతుల్లోకి వచ్చేసింది. కామెడీ వీడియోలు, షార్ట్స్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో హెల్దీ కామెడీ అనేది టార్చ్ వేసి వెతికినా కనిపించదు. అయినా వాటిలోనే మునిగి తేలుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రిలీజ్ అయిన నెలరోజుల్లోనే అవి ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. దాంతో ప్రేక్షకులు థియేటర్ల జోలికి వెళ్లడం మానేశారు. ఏదైనా స్టార్ హీరో సినిమా, భారీ బడ్జెట్ సినిమా అయితేనే థియేటర్లకు వెళుతున్నారు. అలా వచ్చే ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యాలంటే తమ సినిమాలో ఏదో గొప్పతనం ఉండాలి. అందుకే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అలాంటి సినిమాలు తీసేందుకే నిర్మాతలు ఇష్టపడుతున్నారు.
80, 90 దశకాల్లో వచ్చిన కామెడీ సినిమాలను ఇప్పుడు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రేక్షకుల అభిరుచిలో ఎలాంటి మార్పూ రాలేదని మనం అర్థం చేసుకోవాలి. మంచి హాస్య చిత్రాలను తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఇప్పుడు ఒక సినిమా చెయ్యడానికి ఎలాంటి కమర్షియల్ అంశాలు ఉండాలనేదే ఆలోచిస్తున్నారు తప్ప ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అవ్వడానికి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనే విషయంపై దృష్టి సారించలేకపోతున్నారు దర్శకనిర్మాతలు. కామెడీ సినిమాలనే నమ్ముకొని వాటితోనే సూపర్ సక్సెస్‌లు సాధించిన దర్శకులు ఆరోజుల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు వారి ఆనవాళ్ళు కూడా ఇప్పటి దర్శకుల్లో లేవంటే ఆశ్చర్యం కలగక మానదు. జంధ్యాల, రేలంగి నరసింహారావు, వంశీ, ఇ.వి.వి.సత్యనారాయణలాంటి డైరెక్టర్లు ఇప్పుడు ఒక్కరు కూడా లేకపోవడం హాస్యప్రియులైన తెలుగు ప్రేక్షకులకు బాధ కలిగించే విషయమే.
![]() |
![]() |