![]() |
![]() |
కోల్‌కత్తాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జరిగిన దారుణ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. కళాశాల ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న మౌమిత హత్యాచార ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారి తీసింది. దేశంలోని జూనియర్ డాక్టర్లు ధర్నాలు చేపట్టారు. ఈ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎంతో మంది ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈ కేసు గురించి చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి, బిజెపి నాయకురాలు మాధవీలత ఈ కేసుపై తన స్పందన తెలియజేశారు.
‘గతంలో దేశ రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచారం కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ కేసును ప్రామాణికంగా తీసుకొని నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడీ హత్య కూడా అంతే దారుణంగా జరిగింది. ఎన్ని చిత్ర హింసలు పెట్టి ఆ అమ్మాయిని హత్య చేశారో పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. 150 మిల్లీగ్రామ్స్ స్పెర్మ్ అక్కడ దొరికింది అంటే ఎంత మంది ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి ఉంటారు, ఎన్ని చిత్ర హింసలు పెట్టి ఆమెను హత్య చేశారు అనేది అర్థమవుతుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించి మన దేశంలో ఉన్నన్ని బలమైన చట్టాలు ఏ దేశంలోనూ ఉండవు. చాలా గొప్ప చట్టాలు ఉన్నాయి. కానీ, వాటిని అమలు చేసే విషయంలోనే చాలా జాప్యం జరుగుతుంది. సంవత్సరాల తరబడి ఆయా కేసులు విచారణ జరుగుతూనే ఉంటాయి. ఎవరికీ న్యాయం జరగదు. వెస్ట్ బెంగాల్‌కి ఉన్న మరో దురదృష్టం ఏమిటంటే.. అక్కడ మహిళా సీఎం ఉన్నారు. కానీ, అక్కడ మహిళలపై నాన్‌స్టాప్‌గా దాడులు జరుగుతుంటాయి. ఎవరికీ రక్షణ అనేది లేకుండా పోయింది. ఆమధ్య కొందరు మహిళలను నగ్నంగా రోడ్ల మీద నడిపించారు. అంతేకాకుండా సందేశ్‌కాలిలోని గిరిజన మహిళలను వారి భర్తలే తీసుకెళ్ళి పార్టీ ఆఫీసుల దగ్గర డ్రాప్ చేసి వస్తారు. ఇలాంటి దారుణమైన వాటిని ‘విక్రమార్కుడు’ సినిమాలో మనం చూశాం. ఆ తరహాలోనే మహిళలను పార్టీ కార్యాలయాల దగ్గర భర్తగానీ, వారి బంధువులుగానీ వదిలి వెళతారు. రాత్రంతా వారిని వాడుకున్న తర్వాత మళ్ళీ ఆ మహిళలను ఇంటికి తెచ్చుకుంటారు. ఇలాంటివి జరిగినపుడు కొన్నిరోజులు హడావిడి చేస్తారు. తర్వాత వాటి గురించి ఎవ్వరూ పట్టించుకోరు.
ఇప్పుడు జరిగిన జూనియర్ డాక్టర్ హత్య కేసులో కూడా అక్కడ పురోగతి సాధించినట్టు నాకైతే అనిపించడం లేదు. ఈ విషయంలో నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే దీనికి సంబంధించి ఏం జరుగుతోంది, కేసును ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఎలాంటి విచారణ చేస్తున్నారు వంటి విషయాలు బయటికి రావడం లేదు. దీని వెనుక రాజకీయాలు ఉన్నాయా లేక మరో కారణం ఉందా అనేది తెలియదు. ఇలాంటివి అక్కడ ఎన్ని జరిగినా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ పట్టించుకోరు. పైగా, న్యాయం కోసం ధర్నాలు చేసే వారిపైనే పోలీసులతో దాడి చేయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకొని సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కేసుల్లో ఉరి శిక్ష కూడా వెయ్యవచ్చని కొత్త చట్టం కూడా వచ్చింది. కానీ, కేంద్రం ఈ కేసు విషయంలో మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ హత్యాచారంపై నోరు విప్పి కొందరు ప్రభుత్వ డాక్టర్లను కూడా బదిలీ చేశారని తెలుస్తోంది. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్‌పై కొన్ని ఆరోపణలు కూడా ఈ కేసు నేపథ్యంలోనే బయటికి వచ్చాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. నిందితుల్ని తప్పించేందుకు చూస్తున్నారని అర్థమవుతోంది. కేసును తారుమారు చేసే ప్రయత్నం కూడా చెయ్యొచ్చు. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, రెచ్చగొట్టే విధంగా ఆమె ప్రవర్తన ఉండడం వల్లే రేప్ జరిగిందని కూడా చెప్పే అవకాశం ఉంది. వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు, కేసును ఎలాగైనా మలుపు తిప్పొచ్చు’ అంటూ ఈ కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాధవీలత.
![]() |
![]() |