![]() |
![]() |
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో దర్శకుడుగా తెలుగు చిత్ర సీమలో ప్రవేశించిన నాగ్ అశ్విన్ అనతికాలంలోనే టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. ‘మహానటి’ వంటి దృశ్యకావ్యంతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన తాజాగా ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898ఎడి’ వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ.1100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ‘కల్కి’ చిత్ర నిర్మాణంలో బిజీగా వున్న నాగ్‌కి ఇప్పుడు సమయం దొరకడంతో తన కుటుంబంతో గడుపుతూ కొన్ని సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.
తన సొంత గ్రామమైన ఐతోలులోని గవర్నమెంట్ స్కూల్‌లో అదనపు గదుల నిర్మాణానికి ఆర్థిక సాయం చేశారు. ఇటీవల నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని ఐతోలులో పర్యటించారు. తన సొంత ఖర్చుతో నిర్మించిన పాఠశాల అదనపు గదులను నాగ్ అశ్విన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజేశ్, కలెక్టర్ సంతోష్, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నాగ్ చేసిన ఈ మంచి పనికి అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.
![]() |
![]() |