![]() |
![]() |
సినిమాల్లో నటించడం ద్వారానే కాదు, నిజ జీవితంలో తాము చేసే కొన్ని మంచి పనులతో ప్రేక్షకులకు సంతోషాన్ని అందిస్తుంటారు కొందరు స్టార్స్. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, తమని అభిమానించే వారి కోసం సమయం కేటాయించడం, అరుదైన వ్యాధులతో బాధపడేవారిని పరామర్శించి వారిలో మనో ధైర్యాన్ని నింపడం వంటి పనులు చేసే స్టార్స్ కొందరున్నారు. వారిలో నాగచైతన్య ఒకరు. ఎవరితోనూ విభేదాలు తెచ్చుకోకుండా వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న చైతన్య తన దగ్గర పనిచేవారిని కూడా బాగా చూసుకుంటారన్న పేరు ఉంది. కొందరు సినీ ప్రముఖులు వారి వ్యక్తిగత సిబ్బంది ఇంట్లో జరిగే శుభకార్యాలకు హాజరు కావడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా నాగచైతన్య అలాంటి ఓ వివాహానికి హాజరై అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. విశేషం ఏమిటంటే.. ఆగస్ట్ 8న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మరుసటి రోజే రాజమండ్రిలో జరిగిన ఈ పెళ్లికి హాజరయ్యారు చైతన్య.
నాగచైతన్యకు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్త్ను వెంకటేష్ వివాహం శక్రవారం రాజమండ్రిలో జరిగింది. ఈ వివాహ వేడుకకు నాగచైతన్య హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది. నూతన వధూవరులను ఆశీర్వదించి వారి బంధు మిత్రులతో చాలా సేపు గడిపారు చైతన్య. అంతేకాదు, వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో ఎంతో ఓపికగా ఫోటోలు దిగారు. చైతన్య హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నిజ జీవితంలో చైతన్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. వాటిని పబ్లిసిటీ చేసుకునేందుకు చైతన్య ఇష్టపడడట.
ఇక నాగచైతన్య చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం ‘తండేల్’ అనే మూవీలో నటిస్తున్నారు. మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |