![]() |
![]() |
.webp)
గత కొన్ని రోజులుగా రాజ్‌తరుణ్, లావణ్య మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. పెళ్ళి చేసుకొని ఇప్పుడు మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని, ఈ విషయంలో తనను మోసం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు వెలుగులోకి వచ్చి నెలరోజులు దాటిపోయింది. ఆరోజు నుంచి ఈరోజు వరకు డైలీ సీరియల్‌లో ఉండే ట్విస్టులను మించిన ట్విస్టులు ఈ వివాదంలో ఉండడంతో రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టును కోరారు.
ముందస్తు బెయిల్‌కి సంబంధించిన విచారణ గురువారం జరిగింది. 30కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తన క్లయింట్ రాజ్ తరుణ్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ తప్పుడు కేసును పెట్టారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. తనను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న లావణ్య ఈరోజు వరకు దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని రాజ్ తరుణ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయాలను పరిశీలించిన న్యాయమూర్తి.. రాజ్ తరుణ్‌కు రూ.20 వేల పూచీకత్తుతో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేశారు.
ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్‌ను విచారించాలి తప్ప అరెస్ట్ చేయరాదని పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. రాజ్ తరుణ్ కూడా విచారణకు సహకరించాలని న్యాయమూర్తి సూచించారు. ఇప్పటివరకు మీడియాలో, సోషల్ మీడియాలో ఈ కేసుతో సంబంధం ఉన్నవారు, సంబంధం లేని వారు కూడా రకరకాలుగా వాదనలు చేశారు. ఈమధ్యకాలంలో అత్యంత సంచలనంగా మారిన రాజ్ తరుణ్, లావణ్య కేసు కాస్త ముందుకు వెళ్లింది. రాజ్ తరుణ్‌కు ముందస్తు బెయిల్ మంజూరైన నేపథ్యంలో లావణ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.
![]() |
![]() |