![]() |
![]() |
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు సర్వసాధారణమైన విషయం. సినిమా రంగంలో ఉన్న నటీనటులు పెళ్లి చేసుకోవడం అనేది పాత జనరేషన్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి సినిమా చేస్తున్న సమయంలో ప్రేమలో పడడం, అది పెళ్లికి దారితీయడం అనేక జంటల విషయంలో జరిగింది. అలా ఎంతో మంది హీరోహీరోయిన్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా మెగా హీరో సాయితేజ్, మెహ్రీన్ పేర్లు వినిపస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియకపోయినా ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే దీనిపై సాయితేజ్ అస్పష్టమైన క్లారిటీ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
ఇటీవల జరిగిన ‘ఉషా పరిణయం’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నాడు సాయితేజ్. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు సాయితేజ్ దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. దానిపై స్పందించిన సాయితేజ్ ‘లవ్ అయితే ఉంది. కానీ, అది వన్ సైడ్ లవ్ మాత్రమే. అటు సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకవేళ నాకు ఎవరైనా నచ్చి ప్రపోజ్ చేసే లోపే.. మీకు పెళ్ళి ఫిక్స్ అయిందట కదా.. మీడియాలో చూశాం’ అని అంటున్నారు’ అని నవ్వుతూ చెప్పారు సాయితేజ్. ‘మరి త్వరలోనే మీ పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై మీ స్పందన ఏమిటి? ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు?’ అని ప్రశ్నించగా ‘నేను చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో ‘నో పెళ్లి..’ అనే పాట ఉంది. మీకు తెలుసు కదా’ అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు.
సాయితేజ్ పెళ్లికి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకసారి వారి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, మరోసారి అతనితో కలిసి రెండు సినిమాల్లో నటించిన రెజినాతో లవ్‌లో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు సాయితేజ్. తాజాగా మెహరీన్ పేరు వినిపిస్తోంది. 2021లో హర్యానాకు చెందిన భవ్య బిష్ణోయ్‌తో మెహరీన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. భవ్య ఎవరో కాదు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు. కోవిడ్ కారణంగా పెళ్ళిని వాయిదా వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ వారిద్దరి ఎంగేజ్‌మెంట్‌ని పరస్పర అంగీకారంతోనే రద్దు చేసుకున్నారు. తాజాగా సాయితేజ్‌ని పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అతన్ని పెళ్లి చేసుకునేందుకే తన ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకుందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.
తాజాగా సాయితేజ్ దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పటికీ అతను సరైన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సాయితేజ్, మెహరీన్‌లపై సోషల్ మీడియాలో వస్తున్న వార్త నిజమేనన్న అనుమానం బలపడుతోంది. ఎందుకంటే హీరో, హీరోయిన్‌ల మధ్య నడిచే ప్రేమ వ్యవహారం గురించి మీడియా ఎప్పుడు ప్రశ్నించినా అలాంటిదేమీ లేదు, తామిద్దరం స్నేహితులం మాత్రమేనని వారు చెప్తుంటారు. కట్ చేస్తే, ఒక మంచి రోజు పెళ్లికి రెడీ అయిపోతారు. ఇటీవల వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కూడా తమ ప్రేమను మొదట కొట్టి పారేశారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. మరి సాయితేజ్ తన పెళ్లి విషయంలో ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి.
![]() |
![]() |