![]() |
![]() |
.webp)
తెలుగునాట ఎన్నో ప్రేమకథా చిత్రాలు సందడి చేశాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే క్లాసిక్స్ గా నిలిచాయి. అలాంటి సినిమాల్లో 'తొలిప్రేమ' (Tholiprema) ఒకటి. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ కి టర్నింగ్ పాయింట్ లా నిలిచిందీ క్లాసిక్. ఇందులో బాలుగా పవన్ అభినయం యువ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అతణ్ణి అప్పట్లో 'యూత్ ఐకాన్'గా నిలిపింది. ఎ.కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో పవన్ కి జంటగా కీర్తి రెడ్డి నటించగా.. వాసుకి, నగేశ్, అలీ, వేణుమాధవ్, అచ్యుత్, రవిబాబు, పీజే శర్మ, నర్రా వెంకటేశ్వరరావు, సంగీత, బెంగుళూరు పద్మ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
'యువతకు ఓ లక్ష్యం ఉండాలి' అనే పాయింట్ చుట్టూ ఈ సినిమాని అల్లుకున్నారు దర్శకుడు కరుణాకరన్. అను (కీర్తి రెడ్డి)ని తొలిచూపులోనే ప్రేమించిన బాలు.. జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగే ఆమె ప్రేమను పొందాడా? లేదా? అను ప్రేమ బాలు లక్ష్యానికి ఎలాంటి స్ఫూర్తినిచ్చింది? అనే కథాంశంతో 'తొలిప్రేమ' తెరకెక్కింది. కేవలం ప్రేమకథకే పరిమితం కాకుండా అన్నాచెల్లెళ్ళ అనుబంధం, కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందాడు దర్శకుడు కరుణాకరన్.
'ఉత్తమ ప్రాంతీయ చిత్రం' (తెలుగు)గా జాతీయ పురస్కారాన్ని అందుకున్న 'తొలిప్రేమ'.. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ (వాసుకి), బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ (కరుణాకరన్), బెస్ట్ ఆడియోగ్రాఫర్ (మధుసూదన్), బెస్ట్ ఎడిటర్ (మార్తాండ్ కె. వెంకటేశ్) విభాగాల్లో నంది అవార్డులను సొంతం చేసుకుంది. హిందీలో 'ముఝే కుచ్ కెహనా హై' (తుషార్ కపూర్, కరీనా కపూర్), కన్నడలో 'ప్రీతిసు తప్పేనిల్ల' (వి. రవిచంద్రన్, రచన) పేర్లతో ఈ సినిమా రీమేక్ అయింది.
దేవా అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. "ఈ మనసే", "గగనానికి ఉదయం ఒకటే", "ఏమైందో ఏమో ఈ వేళ", "ఏమి సోదరా", "రొమాన్స్ రిథమ్స్".. ఇలా ఇందులోని గీతాలన్ని అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. జీవీజీ రాజు నిర్మించిన 'తొలిప్రేమ'.. 1998 జూలై 24న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ సినిమా 26 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |