![]() |
![]() |
తెలుగువారికి పెద్ద పండగ అంటే సంక్రాంతి. అలాగే సినిమాలకు కూడా సంక్రాంతే పెద్ద పండగ. టాలీవుడ్‌లోని టాప్ హీరోలంతా సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు. అలా సంక్రాంతి వచ్చే సరికి పెద్ద హీరోల సినిమాలన్నీ పోటీలో ఉంటాయి. అలా సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పర్వదినాల్లో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే సంక్రాంతికే హీరోలు, దర్శకనిర్మాతలు పెద్ద పీట వేస్తారు. అందుకే ఆ పండగ మూడు రోజులు సినిమాల జాతర జరుగుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఆగస్ట్ 15కి ఏర్పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే అదే డేట్‌కి 5 సినిమాలు పోటీలో ఉండే అవకాశం ఉంది.
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్‌ల ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ, హరీష్ శంకర్‌ల ‘మిస్టర్ బచ్చన్’, విక్రమ్, పా.రంజిత్‌ల ‘తంగలాన్’తోపాటు సురేష్ ప్రొడక్షన్స్ ‘35’, గీతా ఆర్ట్స్ ‘ఆయ్’ చిత్రాలను ఆగస్ట్ 15కి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వీటిలో డబుల్ ఇస్మార్ట్, తంగలాన్, మిస్టర్ బచ్చన్ పెద్ద సినిమాలు కాగా 35, ఆయ్ చిన్న సినిమాలు. ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్‌హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. వరల్డ్ థియేటర్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడయినట్టు తెలుస్తోంది. విక్రమ్ సినిమా ‘తంగలాన్’ ఒక డిఫరెంట్ జోనర్‌లో రూపొందిన సినిమా అనేది తెలిసిందే. విక్రమ్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడం వల్ల ‘తంగలాన్’ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాల ఫస్ట్ కాపీలు సిద్ధంగా ఉన్నాయి.
మూడో సినిమా ‘మిస్టర్ బచ్చన్’ షూటింగ్ ఇంకా 12 రోజులు బ్యాలెన్స్ ఉంది. దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా వుంది. ఎంత స్పీడప్ చేసినా ఆగస్ట్ 15కి సినిమా రెడీ అవుతుందా అనే సందేహం కూడా ఉంది. అయితే ఈ డేట్‌ని ప్రకటించడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఆ డేట్‌ని ఎనౌన్స్ చేస్తే థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్‌కి సంబంధించిన బిజినెస్ త్వరగా అవుతుందనే అనే ఆలోచనతోనే ఆ డేట్‌ని సెలెక్ట్ చేసుకున్నారంటున్నారు. బిజినెస్ పూర్తయిపోతే ఎలాగైనా ఆగస్ట్ 15కే రిలీజ్ చేసేస్తారు.
మిగిలిన రెండు సినిమాల విషయానికి వస్తే.. అవి రెండూ చిన్న సినిమాలు. పోటీ ఉధృతంగా ఉన్న ఆగస్ట్ 15కే అవి వస్తాయా లేక పెద్ద సినిమాల మధ్య తమ సినిమాలు ఎందుకు అని వెనక్కి తగ్గుతారా అనేది తేలాల్సిన విషయం. ఒకేసారి 5 సినిమాలను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం మూడు సినిమాలు మాత్రం కన్‌ఫర్మ్‌గా రిలీజ్ అవుతాయని తెలుస్తోంది.
![]() |
![]() |