![]() |
![]() |
ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా నటించడం అంటే అది మామూలు లక్ కాదు కదా. ఇప్పుడు ప్రభాస్ ఉన్న రేంజ్‌కి ఏ హీరోయిన్ అయినా నో చెప్పే అవకాశమే లేదు. కానీ, ఒక హీరోయిన్ ప్రభాస్‌తో కలిసి నటించేందుకు నో చెప్పింది అనే ఒక వాదన వినిపిస్తుంది. నో చెప్పలేదుగానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది అని మరికొంతమంది చెబుతారు. దాంతో ఆ సినిమా నుంచి ఆమెను తప్పించారు. అయితే అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఎంతటి టాప్ హీరోయిన్ అయినా పిలిస్తే ఎగురుకుంటూ వచ్చి ప్రభాస్ ముందు వాలిపోతుంది. కానీ, హీరోయిన్‌గా అవకాశం వస్తే దాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు, దర్శకనిర్మాతల్ని ఎందుకు శాటిస్‌ఫై చెయ్యలేకపోయింది అనేది ఆమెకే తెలియాలి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. రకుల్ ప్రీత్ సింగ్. సినిమా పేరు ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’.
ఈ సినిమా చేసే సమయానికి ప్రభాస్ టాప్ హీరో రేంజ్‌లోనే ఉన్నాడు. అప్పటికే వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల డార్లింగ్ అయిపోయాడు ప్రభాస్. ఇక రకుల్ విషయానికి వస్తే.. అప్పటికి ఆమె మొదటి సినిమా ‘కెరటం’ రిలీజ్ కూడా అవ్వలేదు. ఒక కన్నడ సినిమా మాత్రమే చేసింది. ఆ పొజిషన్‌లో ప్రభాస్‌తో సినిమా చేసే ఛాన్స్ మిస్ చేసుకోవడం వెరీ బ్యాడ్ అనే చెప్పాలి. మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో కాజల్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు. ఇద్దరికీ పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే దక్కాయి. అయితే మొదట తాప్సీ క్యారెక్టర్ కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకున్నారు. ప్రభాస్, రకుల్ కాంబినేషన్‌లో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. దర్శకుడు దశరథ్ శాటిస్‌ఫై అయినప్పటికీ దిల్‌రాజుకు మాత్రం నచ్చలేదు. ప్రభాస్, రకుల్ జంట అంతగా ఆకట్టుకోలేకపోయిందని భావించాడు. అందుకే ఆ సినిమా నుంచి రకుల్‌ని తప్పించి ఆ స్థానంలో తాప్సీని తీసుకున్నారు. అప్పట్లో ఈ వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మరో వెర్షన్ ఏం వినిపించిందంటే.. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాజల్. తాప్సీ సెకండ్ హీరోయిన్. ఆ క్యారెక్టర్ చెయ్యడం ఇష్టం లేకనే రకుల్ ఆ ఛాన్స్ వదులుకుందని కూడా చెబుతారు. మరి ఇందులో నిజం ఎంత వుంది అనేది ఆమెకే తెలియాలి.
![]() |
![]() |