![]() |
![]() |

ఎన్నో చైతన్యపూరిత చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి అనారోగ్య కారణాలతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఆరోగ్యం కాస్త విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో నారాయణమూర్తికి వైద్యం అందిస్తున్నారు.
విప్లవ భావాలున్న నారాయణమూర్తి తన కెరీర్‌లో దర్శకత్వం వహించి నిర్మించిన సినిమాలన్నీ ప్రజల్ని చైతన్యపరిచేవే. కమర్షియల్ సినిమాలకు ఎంతో దూరంగా ఉండే ఆయన తను చేసే సినిమాల వల్ల తను నష్టపోయినా మళ్ళీ మళ్ళీ అవే సినిమాలు తీస్తూ తను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. అయితే ఈమధ్య అలాంటి సినిమాలకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో ఆయన చేసిన సినిమా విజయం సాధించి చాలా కాలమైంది. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత తాజాగా ‘యూనివర్సిటీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అది కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురి కావడం ఆయన అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒక హీరోకి ఎలాగైతే అభిమానులు ఉంటారో ఆయన చేసే సినిమాలు, ఆయన నటన మెచ్చి ఎంతో మంది నారాయణమూర్తికి అభిమానులుగా మారారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
![]() |
![]() |