![]() |
![]() |

సుధీర్ బాబు (Sudheer Babu), మాళవిక శర్మ జంటగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా.. పరవాలేదు అనిపించుకుంది. ఈ చిత్రం జూలై 11 నుంచి ఓటీటీ వేదికలు ఆహా, ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఇంకా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి మాత్రం రాలేదు. దీంతో 'హరోం హర' ఓటీటీ విడుదల ఎందుకు ఆగిపోయిందని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే దీనికి కారణం యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అని తెలుస్తోంది.
ఒక చిన్నారి తన తండ్రితో ఉన్న వీడియోపై దారుణ వ్యాఖ్యలు చేసి, ప్రణీత్ హనుమంతు (Praneeth Hanumanthu) అనే యూట్యూబర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రణీత్ 'హరోం హర' చిత్రంలో ఒక పాత్ర పోషించాడు. చిన్నారిపై దారుణ వ్యాఖ్యలు చేసి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి ఆగ్రహాన్ని ఎదుర్కొన్న ఈ యూట్యూబర్.. హీరో సుధీర్ బాబు ఆగ్రహాన్ని కూడా చూశాడు. ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి ఇలాంటి వాడని తెలియదని, తెలిసుంటే అసలు తమ సినిమాలో తీసుకునే వాళ్ళమే కాదని ఘాటుగా స్పందించాడు సుధీర్. హీరో బాటలోనే మేము అన్నట్టుగా.. మూవీ టీం కూడా షాకింగ్ డెసిషన్ తీసుకుందట. సినిమాలో ప్రణీత్ ఉన్న సన్నివేశాలను తొలగించి ఓటీటీలో కొత్త వెర్షన్ ని రిలీజ్ చేయనున్నారట. అందుకే జూలై 11న ఓటీటీ విడుదల ఆపేశారని సమాచారం.

అయితే 'హరోం హర' టీం తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఇటువంటి దారుణ వ్యాఖ్యలు చేసిన నటీనటులు పలువురు ఉన్నారని, నేరాలు చేసి కొందరు జైలుకి వెళ్లిన వారు కూడా ఉన్నారని.. అంత మాత్రాన వారు నటించిన సన్నివేశాలను తొలగించి సినిమాకి నష్టం కలిగించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఒకరు చేసిన తప్పుకి, అనవసరంగా సినిమాకి నష్టం చేసుకోవడం ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |