![]() |
![]() |
డైరెక్టర్ శంకర్ సినిమాల్లో సామాజిక స్పృహ కనిపిస్తుంది. విద్య అనేది వాప్యారం కాదు అని ఒక సినిమాలో చెబితే, ప్రతి మనిషికీ బాధ్యత అనేది ఉండాలని మరో సినిమాలో చెబుతాడు. దేశంలో అవినీతి, లంచగొండితనం నశించిపోవాలని ఒక సినిమాలో చూపిస్తాడు.. ఆ సినిమాలు చూసిన తర్వాత ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది అనేది వేరే విషయం. తన సినిమాలతో జనాన్ని మేల్కొలిపే ప్రయత్నమేతే చేసేవాడు. అయితే తాజాగా వచ్చిన ‘భారతీయుడు2’ చిత్రంలో అక్రమంగా డబ్బు సంపాదించినవారు, లంచాలు తీసుకునే వారు, ప్రజల ఆనారోగ్యంపై వ్యాపారం చేసేవారి గురించి ప్రస్తావించాడు. ఆ క్రమంలోనే విజయ్ మాల్యా, ముఖేష్ అంబానీలను టార్గెట్ చేశాడు.
ఇండియాలో పలు వ్యాపారాలు చేసి వాటిని అడ్డం పెట్టుకొని వివిధ బ్యాంకుల్లో 12 వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటాడు అమిత్ అగర్వాల్(గుల్షన్ గ్రోవర్). వాటిని ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న అతనిపై పంజా విసురుతాడు ఇండియన్. సముద్రం మధ్యలో ఓ షిప్‌లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న అగర్వాల్‌ను తన మర్మకళతో పాయింట్ ఫైవ్‌గా మార్చి ఆ తర్వాత హత్య చేస్తాడు. అలాగే కోట్ల డబ్బులో మునిగి తేలే ఐశ్వర్యవంతుడుగా దర్శన్ భాయ్(జాకీర్ హుస్సేన్)ను చూపించాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే అతని ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా బంగారమే. ఆఖరికి టాయ్‌లెట్ కూడా బంగారంతో చేసిందే. అతని కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తుంటాడు. అలాంటి కుబేరుడ్ని తన మర్మకళతో పిచ్చివాడ్ని చేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు భారతీయుడు.
భారతీయుడు2 చిత్రం ప్రధానంగా లంచగొండితనంపై తీసిన సినిమా. ప్రతిశాఖలోనూ లంచం అనే పదం తాండవిస్తోంది అన్నట్టుగా చూపించారు. అందులో ఈ రెండు క్యారెక్టర్లను ఎందుకు జొప్పించినట్టో తెలీదు. అమిత్ అగర్వాల్, దర్శన్‌భాయ్ క్యారెక్టర్లు విజయ్ మాల్యా, ముఖేష్ అంబానీని పోలి ఉంటాయి. విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి వేల కోట్ల లోన్ తీసుకున్న మాట వాస్తవమే. కానీ, ముఖేష్ అంబానీని పోలిన క్యారెక్టర్‌ను సినిమాలో ఎందుకు పెట్టారో అస్సలు అర్థం కాదు.
![]() |
![]() |