![]() |
![]() |

సినిమా రంగానికి సంబంధించిన పురస్కారాల్లో అత్యున్నతమైనది, ప్రతిష్ఠాత్మకమైనదిగా ఆస్కార్ అవార్డును పరిగణిస్తారు. ఈ అవార్డు అందుకోవడం అనేది ప్రతి కళాకారుడి లక్ష్యంగా చెబుతారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ఇటీవల కొత్త సభ్యులకు ఆహ్వానాలు పంపింది. ఈ ఏడాది 487 మంది కొత్త సభ్యులను తమ అకాడమీలో చేర్చుకుంటోంది. ఇందులో ఎస్.ఎస్.రాజమౌళి, రమా రాజమౌళి కూడా ఉండడం విశేషం. ఇంకా షబానా ఆజ్మీ, రితేష్ సిధ్వానీ, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్, ఫిలిం మేకర్ రిమా దాస్, ‘నాటు నాటు’ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్రక్షిత్తోపాటు మరికొంతమందికి ఆస్కార్ అవార్డులను అందజేసే అకాడమీలో సభ్యత్వం పొందేందుకు ఆహ్వానం అందింది. ఇందులో 71 మంది ఆస్కార్ నామినీలు, 19 మంది ఆస్కార్ విజేతలు కూడా ఉన్నారు.
ఆహ్వానం అందుకున్న వారు కమిటీలో చేరితే మొత్తం 10,910 సభ్యులు అవుతారు. అయితే వీరిలో 9,000 మందికి మాత్రమే ఆస్కార్ అవార్డు వేడుకల సమయంలో ఓటు వేయడానికి అర్హత కలిగి ఉంటారు. అకాడమీ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు ఈ సంవత్సరం ఆహ్వానం అందుకున్న వారిలో 44 శాతం మహిళలు, 41 శాతం ఎథ్నిక్ కమ్యూనిటీలు ఉన్నారు. అమెరికాతోపాటు మరో 56 దేశాలకు చెందిన ప్రముఖులకు అకాడమీ ఆహ్వానాలు పంపింది. ఎక్కువ శాఖలలో ఆహ్వానాలు అందినవారు సభ్యత్వం కోసం ఏదో ఒక శాఖను మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది.
దేశవిదేశాల్లో ఉన్న ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన తర్వాత అకాడమీ సీఈఓ బిల్ క్రామిర్, అధ్యక్షుడు జానెత్ యాంగ్ మాట్లాడుతూ ‘ఈ ఏడాది కొత్త సభ్యులకు ఆహ్వానం పంపడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రపంచదేశాలకు చెందిన ఎంతో మంది కళాకారులు, నిపుణులు చిత్ర నిర్మాణ రంగంపై ఎంతో ప్రభావాన్ని చూపారు. అలాంటి ప్రతిభావంతులకు ఆహ్వానాలు పంపించడం, వారిని మా అకాడమీలో సభ్యులుగా చేర్చుకోవడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అన్నారు.
![]() |
![]() |