![]() |
![]() |

ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) కి బ్యాడ్ టైం నడుస్తుంది అనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. మెగా అభిమానులంతా బన్నీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు సైతం బన్నీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశాడు. ఇలా తెలిసో తెలియకో.. మెగా కుటుంబానికి, మెగా అభిమానులకు దూరమవుతున్న బన్నీకి.. సినిమాల పరంగానూ షాక్ లు తగులుతున్నాయి. ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' (Pushpa 2) డిసెంబర్ 6 కి వాయిదా పడింది. అట్లీతో చేయాల్సిన భారీ సినిమా ఆగిపోయింది. ఇది చాలదు అన్నట్టు అభిమానుల నుంచి కూడా కొత్త చిక్కులు మొదలయ్యాయి.

స్టార్ హీరోల సినిమాల కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అలాంటిది విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో.. సినిమా వాయిదా పడిందన్న వార్త వస్తే.. వారి బాధ మాటల్లో వర్ణించలేనిది. ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల పరిస్థితి అలాగే ఉంది. బన్నీ హీరోగా నటించిన 'పుష్ప-1'.. 2021 డిసెంబర్ లో విడుదలై.. పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించింది. అందుకే దానికి సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15 వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురు చూశారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ.. ఈ సినిమా డిసెంబర్ 6 కి వాయిదా అని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. నిజానికి 'బాహుబలి-1', 'బాహుబలి-2' సినిమాల మధ్య కూడా ఇంత గ్యాప్ లేదు. కానీ పుష్ప సినిమాల మధ్య ఏకంగా మూడేళ్లు గ్యాప్ వస్తోంది. దీంతో అభిమానుల ఆవేదన ఆగ్రహంగా మారుతోంది. అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోవద్దని ఫైర్ అవుతున్నారు. ఇంకా కొందరు అభిమానులైతే ఒకడుగు ముందుకేసి.. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం ఫిల్మ్ మేకర్స్ కి జోక్ అయిపోయిందని, దీనిపై పుష్ప అభిమానుల తరపున కోర్టులో కేసు వేస్తామని బెదిరిస్తున్నారు. మరి అభిమానులను కూల్ చేయడానికి పుష్పరాజ్ ఏం చేస్తాడో చూడాలి.
![]() |
![]() |