![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ కంటే ముందు ఈ ఘనత సాధించిన టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందిన వారు పలువురు ఉన్నారు కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పని చేసిన వారిని మాత్రం వేళ్ళ మీదనే లెక్క పెట్టవచ్చు.
పవన్ కళ్యాణ్ కంటే మెగా కుటుంబం నుంచి చిరంజీవి (Chiranjeevi) మంత్రిగా పనిచేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ఆయన, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభకు ఎంపికై.. కేంద్ర పర్యాటక మంత్రిగా విధులు నిర్వర్తించారు.
దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
సినిమాల్లో హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసిన బాబూమోహన్.. రాజకీయాల్లోనూ సత్తా చాటారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక శాఖామంత్రిగా పనిచేశారు.
తెలుగునాట రాజకీయాల్లో రాణించిన నటీమణుల్లో రోజా ఒకరు. ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు కొందరున్నారు కానీ.. ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత మాత్రం ఇప్పటివరకు నందమూరి తారక రామారావు (NTR)కే సొంతం. 1982 లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్.. కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి.. ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. మరి భవిష్యత్తులో ఎన్టీఆర్ సరసన ఎవరైనా టాలీవుడ్ సెలబ్రిటీ నిలుస్తారేమో చూడాలి.
![]() |
![]() |