![]() |
![]() |
ఈనాడుతో జర్నలిజంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి సంస్థలను స్థాపించి ఆయా రంగాల్లోనూ విజయం సాధించారు. వీటితోపాటు సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీరావు. 1984లో ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి తమ బేనర్‌లో నిర్మించే సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలి, ప్రజల్ని చైతన్య వంతుల్ని చెయ్యాలి, పిల్లల్లో స్ఫూర్తిని నింపే సినిమాలు నిర్మించాలి అనే సిద్ధాంతానికి కట్టుబడి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు రామోజీరావు. తమ సంస్థ ద్వారా ఎంతో మంది నూతన నటీనటుల్ని, దర్శకుల్ని, సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేశారు. అంతేకాదు సినిమా రంగం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలింసిటీని నిర్మించారు. స్క్రిప్ట్‌తో స్టూడియోలోకి వెళితే ఫస్ట్ కాపీతో బయటికి వచ్చేలా స్టూడియోలో అన్ని సదుపాయాలు కల్పించారు. రామోజీ ఫిలింసిటీ ప్రారంభమైన నాటి నుంచి దేశంలోని అన్ని భాషలకు సంబంధించిన సినిమాల షూటింగులు ఇక్కడ జరుగుతున్నాయి.
1984లో ప్రారంభమైన ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలి భాషల్లో దాదాపు 60 సినిమాలు నిర్మించారు. సినిమాల నిర్మాణంలోనూ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ తాము నిర్మించే సినిమాల్లో ఎలాంటి అశ్లీలానికి తావు లేకుండా చక్కని కుటుంబ కథా చిత్రాలు నిర్మించారు రామోజీరావు. ఉషాకిరణ్ మూవీస్ బేనర్ నిర్మించిన సినిమాల్లో కొన్ని మైల్‌స్టోన్‌లాంటి సినిమాలు, తెలుగు సినిమా గతి మార్చిన సినిమాల గురించి తెలుసుకుందాం.
నరేష్ హీరోగా జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ’ ఘనవిజయం సాధించి ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. హాస్య చిత్రాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించిందా సినిమా. 1985లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మించిన ‘మయూరి’ సంచలన విజయాన్ని సాధించింది. నృత్యకారిణి అయిన సుధా చంద్రన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఒక ప్రమాదంలో మయూరి కాలు కోల్పోతుంది. అయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా జైపూర్ కాలుతో ఎంతో సాధన చేసి నృత్య ప్రదర్శనలు ఇస్తుంది. ఈ సినిమా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. 1985 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘మయూరి’ చిత్రాన్ని ప్రదర్శించారు. అంతేకాదు, 2014లో అదే చిత్రోత్సవంలో నృత్య ప్రధాన చిత్రాల విభాగంలో మళ్ళీ ప్రదర్శించారు. తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాకీ అందని అరుదైన గౌరవం ఈ సినిమాకి దక్కింది. ఏకంగా 14 నంది అవార్డులు ఈ సినిమా గెలుచుకోవడం ఇప్పటికీ చెరిగిపోని రికార్డుగా ఉంది.
1985లో టి.కృష్ణ దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘ప్రతిఘటన’ చిత్రం ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. విజయశాంతి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. గూండా రాజకీయాలకు వ్యతిరేకంగా ఓ మహిళ చేసిన పోరాటమే ‘ప్రతిఘటన’. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఈ సినిమా 6 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాను తమిళ్‌లోకి డబ్ చేశారు. హిందీ, మలయాళంలలో రీమేక్ చేశారు.
1989లో యమున ప్రధాన పాత్రలో ఎ.మోహనగాంధీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మౌనపోరాటం’. సబిత అనే ఓ ఆదివాసి మహిళ జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. నేపథ్యగాయని ఎస్.జానకి సంగీత దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇది. ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌ని ప్రేమించి మోసపోయి అతని వల్ల గర్భవతి అయిన ఓ ఆదివాసి మహిళ న్యాయం కోసం చేసిన పోరాటమే ‘మౌనపోరాటం’. ఎంతో వైవిధ్యభరితంగా రూపొందించిన ఈ సినిమా అందరి మన్ననలు అందుకుంది. ఈ సినిమాకి రెండు నంది అవార్డులు లభించాయి.
1991లో మౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అశ్వని’. అథ్లెట్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అశ్వనీనాచప్ప ఈ సినిమాలోనూ అదే పాత్రను పోషించింది. క్రీడల పట్ల పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. తృతీయ ఉత్తమ చిత్రంగా ‘అశ్వని’ నంది అవార్డును గెలుచుకుంది.
2000లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘చిత్రం’ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. చాలా తక్కువ బడ్జెట్‌తో అందరూ కొత్త తారలతో యూత్‌ఫుల్ మూవీగా నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత ఇలాంటి మరిన్ని సినిమాలు రావడానికి కారణమైంది. అదే సంవత్సరం తరుణ్, రిచా జంటగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో నిర్మించిన ‘నువ్వే కావాలి’ చిత్రం మరో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈ తరహా ప్రేమకథా చిత్రాలు ఎన్నో వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుందీ సినిమా. 2001లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆనందం’. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా కూడా ఒక కొత్త ట్రెండ్‌ని సెట్ చేసింది. ఈ సినిమా తర్వాత కూడా ఈ తరహా సినిమాలు అనేకం వచ్చాయి.
ఇలా తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన ఎన్నో సినిమాలను నిర్మించి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు రామోజీరావు. తమ సంస్థ ద్వారా ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత రామోజీరావుది. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోగా రాణిస్తున్న ఎన్టీఆర్.. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘నిన్ను చూడాలని’ చిత్రంతోనే హీరోగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్‌రామ్ ఈ సంస్థ నిర్మించిన ‘తొలిచూపులోనే’ చిత్రం ద్వారానే హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. అప్పటివరకు బాలనటుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ ‘నువ్వేకావాలి’ చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ‘చిత్రం’ సినిమాతో ఉదయ్‌కిరణ్ హీరోగా, తేజ దర్శకుడిగా పరిచయమయ్యారు.
![]() |
![]() |