![]() |
![]() |

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ 'ఓజీ' (OG). ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొని, సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడేలా చేసింది. ఇది పవన్ కళ్యాణ్ యొక్క అసలుసిసలైన బాక్సాఫీస్ స్టామినాను తెలిపే సినిమా అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే, ఈ మూవీ విడుదల తేదీ అయిన సెప్టెంబర్ 27 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి ఓ భారీ షాక్ తగలనుందని తెలుస్తోంది. ఈ మూవీ వాయిదా పడిందని సమాచారం.
నిజానికి సెప్టెంబర్ 27న విడుదల కావాల్సిన 'ఓజీ' పోస్ట్ పోన్ కానుందని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు. దాంతో సినిమా షూటింగ్ లకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇటీవల ఏపీలో ఎన్నికలు ముగిశాయి.. త్వరలో ఫలితాలు కూడా రానున్నాయి. ఈసారి ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే సినిమాల షూటింగ్ కి సమయం కేటాయించడానికి పవన్ మరికొద్ది నెలలు టైం తీసుకునే అవకాశముంది. ఆ ప్రభావం 'ఓజీ'పై పడి, షూటింగ్ ఆలస్యమై, సినిమా వాయిదా పడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఒకవేళ 'ఓజీ' వాయిదా పడితే, సెప్టెంబర్ 27కి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా ఇటీవల న్యూస్ వినిపించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో సినిమా తెరపైకి వచ్చింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'లక్కీ భాస్కర్'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో 'ఓజీ' వాయిదాపై దాదాపు క్లారిటీ వచ్చినట్లయింది. ఎందుకంటే 'లక్కీ భాస్కర్' నిర్మాత నాగవంశీకి పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధముంది. పవన్ ని సంప్రదించకుండా, 'ఓజీ' వాయిదాపై క్లారిటీ లేకుండా.. ఆయన తన సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశంలేదు. ఈ లెక్కన 'ఓజీ' పోస్ట్ పోన్ అయిందని ఓ అంచనాకు రావొచ్చు. మరోవైపు 'గేమ్ ఛేంజర్' కూడా సెప్టెంబర్ 27కి రావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట.
![]() |
![]() |