![]() |
![]() |
ఒకప్పుడు సినిమా చూడాలంటే ప్రేక్షకులకు థియేటర్లే శరణ్యం. అందుకే అప్పుడు థియేటర్ల పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది. ఇప్పుడు ఉన్న మాధ్యమాలు అప్పుడు అందుబాటులో లేకపోవడంవల్ల ఎగ్జిబిటర్లకు నష్టం అనే మాట వినిపించేది కాదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ థియేటర్ల అవసరం తగ్గుతూ వచ్చింది. దశలవారీగా జరిగిన ఈ మార్పుతో దేశంలోని ఎన్నో థియేటర్లు మూతపడ్డాయి. మరికొన్ని నష్టాలతోనే నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఈ ఏడాది నాలుగు నెలలపాటు థియేటర్లకు సరైన ఫీడిరగ్ లేకపోవడంతో కొన్ని రోజులు థియేటర్లను బంద్ చెయ్యాలన్న ఆలోచన కూడా చేశారు.
ఈ క్రమంలోనే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి నైజాంలో షేరింగ్ పద్ధతిని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయం పట్ల టాలీవుడ్‌లోని చాలా మంది నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన నిర్మాత బన్ని వాసు నాలుగు నెలలు వ్యాపారం లేనంత మాత్రాన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం దీనికి పరిష్కారం కాదంటున్నారు. ఈ షేరింగ్ అగ్రిమెంట్ వల్ల చిన్న సినిమాల నిర్మాతలు బాగా నష్టపోతారని అభిప్రాయపడుతున్నారు. భారీ సినిమాల్లా చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ ఆశించినంత ఉండవని, తొలి వారంలో సినిమాకి వచ్చిన టాక్, మౌత్‌టాక్, రివ్యూల ఆధారంగా రెండో వారం నుంచి కలెక్షన్స్ పెరుగుతాయంటున్నారు బన్నివాసు. ఆ సమయంలోనే వచ్చే ఆదాయంలో 70 శాతం ఎగ్జిబిటర్‌కే ఇచ్చేస్తే చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఎక్కువ శాతం రెండో వారం నుంచే లాభాల్లోకి వెళ్ళాయన్న విషయాన్ని అందరూ గుర్తించాలంటున్నారు.
తాను కూడా ఎగ్జిబిటర్నేనని, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయల వరకు తనకు నష్టం వచ్చిందని చెబుతున్నారు వాసు. తనకే అంత నష్టం వస్తే ఎన్నో థియేటర్లు కలిగి వున్నవారికి ఎన్ని కోట్లలో నష్టం వచ్చి వుంటుందో అంచనా వేసుకోవచ్చంటున్నారు. అయినప్పటికీ ఒక నిర్మాతగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చేసుకున్న అగ్రిమెంట్‌ని తాను సమర్థించలేనంటున్నారు. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ చిన్న నిర్మాతలను ఆర్థికంగా బాగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఛాంబర్‌లో కూడా చర్చకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నానని బన్నీవాసు అంటున్నారు.
ఎగ్జిబిటర్లకు ఇంతలా నష్టం రావడానికి కారణం ఓటీటీలని, నిజానికి వాటిమీద పోరాటం చెయ్యాలన్నారు. ఒక సినిమా ఓటీటీకి రావడానికి కనీసం ఎనిమిది వారాల సమయం ఇవ్వాలన్నారు. కానీ, ఒక వారం నుంచి రెండు వారాలలోపే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇలాగే జరిగితే థియేటర్ల వల్ల తమకు ఆదాయం రాదని నిర్మాతలు భావిస్తారని, ఆ కారణంగానే సినిమాలు ఇంకా త్వరగా ఓటీటీలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఈ విషయంలో పోరాటం చెయ్యాల్సి ఉంది తప్ప ఇలాంటి అగ్రిమెంట్ల వల్ల నిర్మాతకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడుతున్నారు వాసు. అసలు చిన్న సినిమాలే లేకపోతే థియేటర్లకు మనుగడ లేదని, పెద్ద సినిమాలు ఏడాది పొడవునా వుండవన్న విషయాన్ని ఎగ్జిబిటర్లు తెలుసుకోవాలని బన్నీవాసు అన్నారు. ఈ విషయాన్ని ఫిలింఛాంబర్‌తోపాటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.
![]() |
![]() |