![]() |
![]() |

క్లాసిక్ సినిమాలను లేదా ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం సహజం. కానీ ఫ్లాప్ సినిమాని ఎవరైనా రీమేక్ చేస్తారా?. అలాంటి రిస్క్ కి సిద్ధమంటున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ఓ ఫ్లాప్ సినిమాని రీమేక్ చేయాలని ఉందని చెప్పి షాకిచ్చాడు.
ఎన్టీఆర్ కి విశ్వక్ సేన్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా, విశ్వక్ నటించిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 31న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "మీకు ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉంది కదా. ఒకవేళ ఆయన నటించిన సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాలంటే.. ఏది చేస్తారు?" అని సుమ అడగగా.. విశ్వక్ ఊహించని సమాధానం ఇచ్చాడు. తనకి ఎన్టీఆర్ అన్న నటించిన 'నా అల్లుడు' సినిమాని రీమేక్ చేయాలని ఉందని తెలిపాడు. ఆ సినిమా బాగుంటుందని, కొన్ని ఛేంజెస్ తో రీమేక్ చేయాలని ఉందని మనసులోని మాట బయటపెట్టాడు. ఎన్టీఆర్ నటించిన పలు హిట్ సినిమాలను వదిలేసి.. 'నా అల్లుడు' సినిమాని రీమేక్ చేస్తానని విశ్వక్ చెప్పడం సర్ ప్రైజింగ్ గా ఉంది.

'నా అల్లుడు' అనేది 2005 లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిల్మ్. వర ముళ్ళపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీక్ గా, మురుగన్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించాడు. శ్రియా, జెనీలియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో.. రమ్యక్రిష్ణ, సుమన్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులోని కామెడీ సన్నివేశాలు అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. అయితే అప్పుడు 'ఆది', 'సింహాద్రి', 'సాంబ' వంటి సినిమాలతో అమాంతం పెరిగిన ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కారణంగా.. బాక్సాఫీస్ దగ్గర 'నా అల్లుడు' ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
![]() |
![]() |