![]() |
![]() |

బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఇందులో తెలుగు నటీనటులు, రాజకీయ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపించడం సంచలనంగా మారింది. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉపయోగించారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి రాగా, మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చే అవకాశముంది.
ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో గోపాల్ రెడ్డికి చెందిన జీఆర్ ఫామ్‌హౌస్‌లో.. హైదరాబాద్ కి చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బర్త్ డే పార్టీ పేరుతో జరిగిన ఈ రేవ్ పార్టీలో మద్యంతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరిగింది. అర్థరాత్రి సమయంలో పోలీసులు దాడి చేసి, డ్రగ్స్ స్వాధీనం చేసుకొని, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ పార్టీలో తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖంగా నటి హేమ పేరు కన్నడ మీడియాలో కోడై కూస్తోంది. ఆమెతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారుని సైతం పోలీసులు గుర్తించారు. దీనితో పాటు దాదాపు 20 లగ్జరీ కార్లు అక్కడ ఉన్నాయట. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఇతర ప్రముఖుల పేర్లు బయటకు రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, కన్నడ మీడియా.. రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు హేమ పేరుని ప్రముఖంగా చెబుతుండగా.. ఆమె మాత్రం ఆ వార్తలను ఖండించింది. తాను హైదరాబాద్ లో ఉన్నాననే, పూర్తి సమాచారం తెలియకుండా ఇలా తన పేరు ప్రసారం చేయడం సరికాదని చెప్పింది.
![]() |
![]() |