![]() |
![]() |

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) కెరీర్ ను 'టెంపర్'కి ముందు 'టెంపర్'కి తర్వాత అని చెప్పవచ్చు. ఆ సినిమా దగ్గర నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. 'టెంపర్' విడుదల సమయంలో ఆయన ఒక మాట అన్నాడు. "నాకు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేదు. నా ప్రతి అభిమాని కాలరెగరేసుకునే సినిమాలు చేస్తాను." అని చెప్పాడు. ఏ ముహూర్తాన ఆ మాట చెప్పాడో కానీ.. అపజయం అనేదే లేకుండా ఎన్టీఆర్ కెరీర్ సాగుతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ మరోసారి 'టెంపర్' టైం నాటి కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశాడు.
సోమవారం సాయంత్రం 'టిల్లు స్క్వేర్'(Tillu Square) మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. తన అప్ కింగ్ మూవీ 'దేవర'(Devara) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "దేవర సినిమా విడుదల లేట్ అయినా.. అభిమానులందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునే లాంటి చిత్రాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం." అని చెప్పాడు.
అలాగే 'దేవర' సినిమా ఎలా ఉంటుంది? అందులో డైలాగ్ లు ఎలా ఉండబోతున్నాయో కూడా ఎన్టీఆర్ రివీల్ చేశాడు."దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గురించి చెప్పను. కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఎక్కువ శాతం ఉంటుంది. కల కనడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి." అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
కాగా, కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దేవర'.. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |