![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశమొస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది ఒక యంగ్ హీరో, ఆయనతో కలిసి నటించే అవకాశమొస్తే రిజెక్ట్ చేశాడని కొద్దిరోజుల క్రితం న్యూస్ వినిపించింది. ఆ హీరో ఎవరో కాదు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని, అందులో సిద్ధు కూడా నటించనున్నాడని మొదట న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి సిద్ధు తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. కొంతకాలానికి అసలు ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు మెగాస్టార్ తో నటించే అవకాశమొస్తే సిద్ధు ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే దానిపై క్లారిటీ లేదు. అయితే తాజాగా దీనిపై సిద్ధు స్పందించాడు.
సిద్ధు నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్' థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. చిరంజీవితో నటించే అవకాశాన్ని వదులుకోవడంపై సిద్ధు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"చిరంజీవి గారితో కలిసి ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నాకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, రజినీకాంత్ గారు వంటి అగ్ర తారలు అందరితో కలిసి పని చేయాలని ఉంది. అలాంటి అగ్ర తారలతో కలిసి నటించే అవకాశం వస్తే.. అది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలి. నా పిల్లలకు 'నేను చిరంజీవి గారితో పనిచేశాను' అని గర్వంగా చెప్పుకోవాలి. నా జీవితంలో ఒక మైల్‌స్టోన్‌గా మిగిలిపోవాలి. దేవుడి దయ ఉంటే ఏదోక రోజు నాకు ఆ అవకాశం వస్తుంది. చిరంజీవి గారి స్టార్‌డమ్‌కి తగిన కథ కుదిరి, ఆయనతో కలిసి నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను." అని సిద్ధు చెప్పుకొచ్చాడు.
సిద్ధు మాటలను బట్టి చూస్తే.. చిరంజీవి సినిమాకి అతను నో చెప్పాడనే వార్తల్లో నిజంలేదని, ఇతర కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని అర్థమవుతోంది. మరి భవిష్యత్ లో చిరంజీవితో కలిసి నటించే అవకాశం సిద్ధుకి వస్తుందేమో చూడాలి.
![]() |
![]() |