![]() |
![]() |

కొంతకాలంగా తెలుగునాట రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు మళ్ళీ థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు మరో క్లాసిక్ మూవీ రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అదే 'ప్రేమికుడు'.
దర్శకుడు శంకర్ కెరీర్ లో మాత్రమే కాకుండా.. తమిళ సినీ పరిశ్రమలోనే క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా 'ప్రేమికుడు' పేరు తెచ్చుకుంది. అప్పటికే 'జెంటిల్ మేన్'తో దర్శకుడిగా పరిచయమై సంచలనం సృష్టించిన శంకర్ నుంచి వచ్చిన రెండో సినిమా ఇది. 1994లో విడుదలైన ఈ సినిమా తెలుగునాట కూడా ప్రభంజనం సృష్టించింది. ఆ సమయంలో 'ప్రేమికుడు' చిత్రంతో ప్రేమలో పడని యువతీయువకులు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా యువత హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఈ చిత్రం. ఆకట్టుకునే కథా కథనాలతో దర్శకుడు శంకర్ వెండితెరపై మ్యాజిక్ చేశాడు. ఇక ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలన్నీ ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. "అందమైన ప్రేమరాణి", "ఊర్వశి ఊర్వశి", "ఓ చెలియా నా ప్రియసఖియా", "ముక్కాల ముకాబలా" ఇలా ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంటాయి. అలాంటి క్లాసిక్ ఫిల్మ్ 'ప్రేమికుడు' ఇప్పుడు తెలుగులో మళ్ళీ థియేటర్లలో అలరించడానికి రెడీ అవుతోంది.

'ప్రేమికుడు' రీ రిలీజ్ రైట్స్ ని మురళీధర్ రెడ్డి, రమణ భారీ ధరకు దక్కించుకున్నారు. సి.ఎల్.ఎన్ మీడియా ద్వారా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారని సమాచారం. 'ప్రేమికుడు' వంటి క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అయితే వసూళ్ల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు. లవ్, కామెడీ, బ్యూటిఫుల్ సాంగ్స్ తో పర్ఫెక్ట్ ట్రీట్ లా ఉండే 'ప్రేమికుడు' సినిమాని చూడటానికి అప్పటి యువతతో పాటు ఈ తరం యువత కూడా థియేటర్లకి క్యూ కట్టే అవకాశముంది.
![]() |
![]() |