![]() |
![]() |

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. ఇంతవరకు ఆమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాకుండానే.. టాలీవుడ్ టాప్ స్టార్ల పక్కన నటించే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తెలుగులో జాన్వీ.. మొదటి సినిమాకే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న 'దేవర' సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఇక రెండో సినిమాకి మరో బిగ్ స్టార్ రామ్ చరణ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందనున్న స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, చరణ్ తో పాటు.. మరో టాప్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఆడిపాడే అవకాశాన్ని జాన్వీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప-1' పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప-2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే మొదటి భాగానికి మించేలా రెండో భాగాన్ని చెక్కే పనిలో ఉంది మూవీ టీం. 'పుష్ప-1' విజయంలో దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా "ఊ అంటావా మావా" స్పెషల్ సాంగ్ ఒక ఊపు ఊపింది. ఇక ఈ పాటలో బన్నీతో కలిసి సమంత చిందులేయడం థియేటర్స్ లో మాస్ ని ఉర్రూతలూగించింది. అందుకే 'పుష్ప-2'లో స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే "ఊ అంటావా మావా" సాంగ్ ని మించేలా 'పుష్ప-2' కోసం దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడట. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి.. జాన్వీ కపూర్ చిందేయనుందని సమాచారం. సోషల్ మీడియాలో తన గ్లామర్ పిక్స్ తోనే కుర్రకారుని ఫిదా చేస్తోంది జాన్వీ. అలాంటి జాన్వీ.. అందాలు ఆరబోస్తూ ప్రత్యేక గీతంలో చిందేస్తే.. థియేటర్లు హీటెక్కిపోతాయి అనడంలో సందేహం లేదు.
'పుష్ప-2'లో జాన్వీ స్పెషల్ సాంగ్ చేస్తుందనే వార్త నిజమైతే.. తెలుగు తెరపై ఆమె సందడి చేసే మొదటి సినిమా ఇదే అయ్యే అవకాశముంది. ఎందుకంటే 'దేవర' అక్టోబర్ 10న విడుదల కానుండగా, 'పుష్ప-2'ని ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే హీరోయిన్ గా మాత్రం ఆమె మొదటి తెలుగు సినిమా దేవరే అవుతుంది.
![]() |
![]() |