![]() |
![]() |

భారతదేశ సంస్కృతి గురించి, ఇక్కడ మహిళలకు ఇచ్చే గౌరవం గురించి ప్రపంచ దేశాలు గొప్పగా మాట్లాడుకుంటాయి. కానీ కొందరి వల్ల మన దేశం గురించి ఇతర దేశాల్లో తప్పుగా మాట్లాడుకునే పరిస్థితి వస్తోంది.
కొందరు మానవ మృగాల కారణంగా భారదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా స్పానిష్ కి చెందిన ఓ మహిళ జార్ఖండ్‌లో సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమె తన భర్తతో కలిసి చాలారోజులుగా బైక్ మీద ప్రపంచ దేశాలు చుట్టేస్తోంది. ఇప్పటికే వారు ఎన్నో దేశాలను సందర్శించగా.. ఎక్కడా వారికి ఇలాంటి ఘటన ఎదురుకాలేదు. ఇండియాలోని జార్ఖండ్‌లో మాత్రం ఊహించని ఘటన ఎదురైంది. ఏడుగురు మానవ మృగాలు ఆమె భర్తను గాయపరిచి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న ఆ జంటను చూసిన పోలీసులు.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆ జంట.. ఇలాంటి ఘటన మరెవరికీ జరగకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దీనిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఘాటుగా స్పందిస్తున్నారు. భారతదేశంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందంటూ బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ ఎమోషనల్ అయింది. "మా దేశంలో మీకు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం బాధగా ఉంది, మీ వెంట మేముంటాం, ఆ రాక్షసులకు తప్పకుండా శిక్ష పడుతుంది" అంటూ స్పానిష్ జంటకు మద్దతుగా శ్వేతా వర్మ పోస్ట్ చేసింది. ఇంకా ఎందరో తమ ఆవేదనను, ఆవేశాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళ మానాన్ని, మన దేశ పరువుని తీసిన ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని.. భవిష్యత్ లో ఎవరైనా ఇలాంటి పని చేయాలంటేనే భయపడేలా శిక్ష విధించాలని కోరుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.
![]() |
![]() |