![]() |
![]() |
ఒక సినిమా సూపర్‌సక్సెస్ అయ్యిందంటే ఆ యూనిట్ సభ్యులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇప్పుడు మీడియా కూడా బాగా విస్తరించడంతో ఏ చిన్న ఈవెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. గత డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దేశంలోని చిత్ర పరిశ్రమల్ని ఒక్కసారిగా కుదిపేసిన సినిమా అది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి సంచలనం సృష్టించింది. ఇలాంటి బ్లాక్‌బస్టర్ మూవీపై విమర్శలు కూడా బాగానే వచ్చాయి. సినిమాలోని వయొలెన్స్, అడల్డ్ కంటెంట్‌పై కొందరు విమర్శలు గుప్పించారు. ఇలాంటివి ఎన్ని జరిగినా సినిమా కలెక్షన్స్‌పై అవి ప్రభావం చూపించలేకపోయాయి. చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.
రిలీజ్ అయిన తర్వాత మీడియా ఈ సినిమాకి కావాల్సినంత హైప్ తీసుకొచ్చింది. హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇంకా యూనిట్‌లోని ఇతర సభ్యులు పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చి తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న మాత్రం రిలీజ్ రోజు నుంచి ఈరోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందర్నీ ఆశ్చర్యపరచింది. సోషల్ మీడియాలో తమ సినిమా సాధించిన సక్సెస్‌పై సాధారణంగా స్పందిస్తుంటారు. కానీ, రష్మిక విషయంలో అది పూర్తిగా రివర్స్ అయింది. ‘యానిమల్’ విషయంలో రష్మిక స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
‘యానిమల్’ చిత్రం రిలీజ్ అయి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఇన్నాళ్ళకు రష్మిక స్పందించింది. ‘మేం చేసిన భారీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు, సూపర్‌హిట్ చేశారు. సినిమాపై నేను స్పందించలేదని అందరూ అనుకున్నారు. అయితే నేను ఆ విజయాన్ని ఆస్వాదించేందుకు కొంత సమయం తీసుకోవాలనుకున్నాను. ‘యానిమల్’ సినిమా రిలీజ్ అయిన మరుసటిరోజే మరో సినిమా షూటింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఈ సినిమాతో బిజీ అయిపోవడం వల్ల ఏ ఈవెంట్‌కీ నేను అటెండ్ అవ్వలేకపోయాను. అంతేకాదు షూటింగ్ కోసం రాత్రి సమయాల్లో కూడా ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. నేను నటించిన సినిమా బాలీవుడ్‌లో అంత పెద్ద విజయం సాధించినా నేను దాన్ని ఆస్వాదించలేకపోయాను. నా సినిమా హిట్ అయినందుకు ప్రేక్షకులు, అభిమానులు పంపే సందేశాలు చదువుతున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. నా విజయాన్ని నేను ఆ విధంగా ఆస్వాదించాను. ఇక్కడ మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చేసే సినిమా కోసం కష్టపడి పనిచేయడమే నాకు తెలుసు. సినిమా పెద్ద హిట్ అయితే ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారు, ఆనందిస్తారు. అదే నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం’ అన్నారు.
![]() |
![]() |