![]() |
![]() |

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, రచయిత వి. మహేష్(85) కన్నుమూశారు. శనివారం రాత్రి చెన్నైలోని తన నివాసంలో కాలుజారి కిందపడిపోగా.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు.
1975 లో వచ్చిన 'మాతృమూర్తి' చిత్రంతో వి. మహేష్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన 'మనుష్యులంతా ఒక్కటే'(1976) చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడమే కాకుండా దానికి కథను అందించి.. ఆ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. అలాగే లక్ష్మి దీపక్ దర్శకత్వంలో 'మహాపురుషుడు' (1981), చిరంజీవి-కోడి రామకృష్ణ కాంబినేషన్ లో 'సింహపురి సింహాం' (1983), సుమన్, బోయిన సుబ్బారావు కలయికలో 'ముసుగు దొంగ' (1985) వంటి చిత్రాలను నిర్మించారు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారమైన 'హరి భక్త కథలు' సీరియల్ కు ఆయన నిర్మాత, రచయితగా వ్యవహరించారు.
వి. మహేష్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కొరుటూరు. మహేష్ అంత్యక్రియలు సోమవారం చెన్నయ్ లో జరుగుతాయని ఆయన మేన్లలుడైన టెలివిజన్ నిర్మాత, దర్శకుడు మహీధర్ వల్లభనేని తెలిపారు.
![]() |
![]() |