![]() |
![]() |
ఒకప్పుడు సినిమా రంగంలో హీరోగా నిలదొక్కుకొని మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎన్నో సినిమాల్లో రకరకాల క్యారెక్టర్స్ చేసిన తర్వాత గానీ ఆ అవకాశం వచ్చేది కాదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి అది మరింత కష్టతరంగా ఉండేది. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ హీరో రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఓవర్‌నైట్ స్టార్ హీరో అయిపోతారు. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి అది మరింత సులువు. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయినా వరసగా సినిమాలు చేసే అవకాశం వారికి ఉంటుంది. కానీ, అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ అఖిల్‌కి అది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.
‘సిసింద్రీ’ చిత్రంతో అతి చిన్న వయసులోనే తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్ ఆ తర్వాత ‘మనం’ చిత్రంలో ఓ మెరుపు మెరిశాడు. ‘అఖిల్’ చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమా విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వరసగా ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘ఏజెంట్’ వంటి సినిమాలతో హిట్ కొట్టేందుకు విపరీతంగా కృషి చేశాడు. కానీ, ఫలితం మాత్రం పాజిటివ్‌గా రాలేదు. అన్ని సినిమాల కంటే ‘ఏజెంట్’ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అతని కష్టమంతా వృధా అయిపోయింది. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే మరో సినిమా ప్రకటించాడు అఖిల్.
అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. గత ఏడాది ఈ సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్‌ను పక్కాగా రెడీ చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్ అనిల్ కుమార్. ఈసారి కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అఖిల్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ వర్క్ జరుగుతోంది.
మార్చిలో ప్రాజెక్ట్‌ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసి అదే నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చెయ్యాలని భావిస్తున్నాడు అఖిల్. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ సంస్థ రూ.80 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో నటించే ప్రధాన తారాగణం, టెక్నీషియన్స్‌ని ఫైనల్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఒక సూపర్‌హిట్ కొట్టి హీరోగా తన సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకోవాలని కృషి చేస్తున్న అఖిల్‌కి ఈ సినిమా అయినా మంచి ఫలితాన్ని అందిస్తుందని ఆశిద్దాం.
![]() |
![]() |