![]() |
![]() |

టాలీవుడ్ టాప్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో వీరి స్నేహం మరింత బలపడింది. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ ఇద్దరూ ప్రస్తుతం పలు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ నటిస్తున్న ఓ సినిమా విషయంలో మాత్రం.. అంతా ఎన్టీఆరే చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని చేస్తున్న రామ్ చరణ్.. తన తదుపరి సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేయాల్సి ఉంది. 'ఉప్పెన' తర్వాత తన రెండో సినిమాని తారక్ తోనే చేయాలని బుచ్చిబాబు చాలాకాలం ఎదురుచూశాడు. ఎన్టీఆర్ సైతం బుచ్చిబాబు చెప్పిన కథతో ఇంప్రెస్ అయ్యి.. ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపాడు. అయితే అప్పటికే తాను కమిట్ అయిన 'దేవర', 'వార్-2', 'ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్', 'దేవర-2' పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందన్న ఉద్దేశంతో.. అంతకాలం ఓ దర్శకుడిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదని భావించి, బుచ్చిబాబుని చరణ్ దగ్గరకు ఎన్టీఆర్ పంపించాడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన మాట. తన స్నేహితుడు ఎన్టీఆర్ సూచించడం, పైగా బుచ్చిబాబు చెప్పిన కథ ఇంప్రెసివ్ గా ఉండటంతో.. చరణ్ ఈ సినిమా చేయడానికి వెంటనే అంగీకరించాడు. ఇలా బుచ్చిబాబుతో చరణ్ సినిమా చేయడానికి ఎన్టీఆర్ కారణమయ్యాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా తారక్ హ్యాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానప్పటికీ.. చరణ్ సినిమాలో జాన్వీ నటించనున్నట్లు ఆమె తండ్రి బోనీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. దీంతో జాన్వీ నటించడం కన్ఫర్మ్ అయింది. అయితే ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఎన్టీఆరే అట. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న 'దేవర' సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే దేవర షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో జాన్వీ అభినయాన్ని మెచ్చిన తారక్.. చరణ్, బుచ్చిబాబులకు ఆమె పేరుని సూచించాడట. అలా జాన్వీ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చినట్లు సమాచారం. మరి తెరవెనుక అంతా తానై అన్నట్టుగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న ఈ సినిమా.. చరణ్ కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
![]() |
![]() |