![]() |
![]() |

జపాన్ లో అభిమానులను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అక్కడ ఎన్టీఆర్ కు ఎందరో అభిమానులున్నారు. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ లకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు జపాన్ లో విడుదలై అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ఆయన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్'కి అయితే అక్కడ బ్రహ్మరథం పట్టారు. త్వరలోనే ఎన్టీఆర్ మరో సినిమాతో జపాన్ ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బృందావనం'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2010 అక్టోబర్ లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ లుక్స్, కామెడీ, డ్యాన్స్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడే సినిమాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా ఒడియా, కన్నడ, బెంగాలీ, భోజ్ పూరి, మరాఠి వంటి పలు భాషల్లో రీమేక్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్ ప్రేక్షకులను పలకరించనుంది.
'బృందావనం' సినిమా మార్చి 15న జపాన్ లో విడుదల కాబోతుంది. తెలుగు ఆడియో, జపనీస్ సబ్ టైటిల్స్ తో ఈ చిత్రం జపాన్ ఆడియన్స్ ని అలరించనుంది. ఇప్పటికే జపాన్ అభిమానులు 'బృందావనం' పోస్టర్లతో హడావుడి కూడా మొదలుపెట్టారు. ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్స్, డ్యాన్స్ లకి అక్కడి ఆడియన్స్ ఫిదా అయ్యే అవకాశముంది. అదే జరిగితే జపాన్ లో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |