![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు'. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో.. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం ఎక్కువ డేట్స్ కేటాయించలేకపోతున్నాడు. అందుకే దీని తర్వాత ప్రకటించిన పవన్ ఇతర సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలవుతున్నాయి కానీ.. వీరమల్లుకి మాత్రం మోక్షం కలగడంలేదు. ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతుండటం, కొంతకాలంగా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా లేకపోవడంతో.. అసలు మొత్తానికే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ, ఇటీవల అదిరిపోయే అప్డేట్ ఇచ్చి పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు మేకర్స్.
ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమాకి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోందని, అలాగే త్వరలోనే ఈ చిత్రం నుంచి ప్రత్యేక ప్రోమోను విడుదల చేయనున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ప్రోమో విడుదలకు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి కానుకగా మార్చి 8న ప్రోమోను విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే నిజమైతే మార్చి 8న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తారు అనడంలో సందేహం లేదు.
ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా జ్ఞానశేఖర్, ఎడిటర్ గా ప్రవీణ్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |