Home  »  News  »  ‘రాజధాని ఫైల్స్’ మూవీ రివ్యూ

Updated : Feb 15, 2024

సినిమా పేరు: రాజధాని ఫైల్స్
తారాగణం: అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, పవన్, విశాల్, షణ్ముఖ్, మధు, అజయ్ రత్నం, అమృత చౌదరి, అంకిత ఠాకూర్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్: రమేష్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు 
మాటలు: అనిల్ అచ్చుగట్ల
రచన, దర్శకత్వం: భాను
నిర్మాత: కంఠంనేని రవిశంకర్
సమర్పణ: హిమ బిందు
బ్యానర్: తెలుగువన్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: ఫిబ్రవరి 15, 2024 

ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సినిమా అనే అభిప్రాయాన్ని ట్రైలర్ తోనే కలిగించింది రాజధాని ఫైల్స్. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ:
అరుణప్రదేశ్ రాష్ట్రంలోని అయిరావతి ప్రాంతం ఏడాదికి రెండు మూడు పంటలు పండే అద్భుతమైన వ్యవసాయ భూమిని కలిగి ఉంటుంది. అయితే ఆ ప్రాంతం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండటం, అన్నింటికీ అనువైన ప్రాంతం కావడంతో.. ప్రభుత్వం అయిరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేస్తుంది. తరతరాలుగా ఆ భూమినే నమ్ముకొని బ్రతుకుతున్న రైతులకు.. తమ భూములు ఇవ్వడం ఇష్టంలేనప్పటికీ.. రాష్ట్రం కోసం, భావి తరాల భవిష్యత్ కోసం.. త్యాగానికి సిద్ధపడతారు. విశ్వనగరం లాంటి రాజధాని నిర్మాణం జరిగితే.. ఎన్నో కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువత భవిష్యత్ బాగుంటుందని ఎంతో సంతోషంగా భూములు త్యాగం చేస్తారు రైతులు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో, తాము కలలు కన్న రాజధానిని త్వరలోనే చూసుకోబోతున్నామని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా.. కొత్త ప్రభుత్వం వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లుతుంది. వారి త్యాగాన్ని వృధా చేస్తుంది. అయిరావతి రాజధానిగా ఉంటే గత ముఖ్యమంత్రి పేరే చరిత్రలో నిలిచిపోతుంది, నీకు ఎలాంటి పేరు రాదని తన పొలిటికల్ అనలిస్ట్ చెప్పిన మాటలతో.. నూతన ముఖ్యమంత్రి నాలుగు రాజధానుల రాగాన్ని ఎత్తుకుంటాడు. దీంతో అయిరావతి రైతులు అహింస మార్గంలో ఉద్యమానికి దిగుతారు. ఆ ఉద్యమాన్ని అణచడానికి సీఎం, అతని అనుచరగణం చేయని దుర్మార్గం ఉండదు. ఆ దుర్మార్గాలను తట్టుకొని రైతులు ఎలా పోరాడారు? ఆ పోరాట ఫలితంగా అయిరావతే రాజధానిగా ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను దర్శకుడు భాను ఎంతో సహజంగా తెరకెక్కించాడు. సినిమాని ఆయన ఎత్తుకున్న విధానం, కథలోకి తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది. ఈ సినిమాలో వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ రైతు కుటుంబానికి చెందిన భార్యాభర్తలుగా కనిపించారు. ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచించే ఆ దంపతులంటే.. చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు ఎంతో గౌరవం. కానీ వాళ్ళ కుమారుడిగా కనిపించిన అఖిలన్ తీరు మాత్రం తన తల్లిదండ్రులకి పూర్తి భిన్నం. చిన్నప్పటి నుంచి అతనికి జనమన్నా, జనంతో కలిసి ఉండటమన్నా చిరాకు. అలాంటి వ్యక్తి.. కొత్త ముఖ్యమంత్రి కారణంగా తన వాళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని.. తన తల్లిదండ్రులు, ఇతర రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొంటాడు. ప్రజలంటే ఇష్టపడని ఓ యువకుడు.. ఆ ప్రజల కోసమే పోరాడినట్లు చూపించాలన్న దర్శకుడి ఆలోచన కట్టిపడేసింది.

సాధారణంగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే ఇలాంటి సినిమాలు డాక్యుమెంటరీ లాగానో, ఆర్ట్ ఫిల్మ్ లాగానో అనిపిస్తాయి. కానీ రాజధాని ఫైల్స్ విషయంలో ఒక్క శాతం కూడా అలా అనిపించదు. రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూనే, కమర్షియల్ అంశాలను కూడా జోడించి సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా మలిచారు. హీరో మరియు అతని తల్లిదండ్రుల మనస్తత్వాలను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 'ఏరువాక సాగారో' అంటూ విషాదం పలకరించడానికి ముందు, రైతుల సంతోషాన్ని పరిచయం చేశాడు దర్శకుడు. రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చేయడం, కొత్త ముఖ్యమంత్రి కారణంగా ఆ త్యాగం వృధా కావడం, రాజధాని కోసం రైతులు పోరాటానికి దిగడం.. ఇలా ప్రతి సన్నివేశం మన కళ్ళముందే జరుగుతున్నంత సహజంగా ఉంటూ.. మనల్ని పూర్తిగా సినిమాలో లీనమయ్యేలా చేశాయి.

బలమైన భావోద్వేగాలతో గుండెలను పిండేసే సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. రాజధాని కోసం పోరాడుతున్న రైతులు ఎన్నో అవమానాలు పడటం, పోలీసుల చేతిలో దెబ్బలు తినడం, ఎందరో ప్రాణాలను కోల్పోవడం, ఆడవారు ప్రాణమానాలను పణంగా పెట్టి పోరాడటం వంటి సన్నివేశాలన్నీ కంటతడి పెట్టిస్తాయి. అరటి తోటలో ఆడవారిని అర్థనగ్నంగా పరుగెత్తించే సన్నివేశం చూస్తే.. ఆ సినిమాలోని హీరోకే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా రక్తం మరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. అంత బలంగా సన్నివేశాలను మలిచారు.

ఈ సినిమాలో రైతులను ఆవేదనను, వారి సమస్యని చూపించడమే కాదు.. ఆ సమస్యకి పరిష్కారం కూడా చూపించారు. పతాక సన్నివేశాలు ఊహించనివిధంగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదనే చెప్పాలి. ఈ క్లైమాక్స్ నిజ జీవితంలో జరిగితే మాత్రం దేశరాజకీయాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశముంది.

సమిష్టి కృషి అనే దానికి నిర్వచనంలా ఈ సినిమా ఉంది. అన్ని విభాగాల పనితీరు అద్భుతంగా ఉంది. దర్శకుడు భాను కథాకథనాలతో పాటు తనదైన మేకింగ్ తో మెప్పించాడు. మణిశర్మని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటారో మరోసారి రుజువైంది. పాటలతో ఎప్పటిలాగే మ్యాజిక్ చేశారు. ఏరువాక సాంగ్ తో పాటు, థీమ్ సాంగ్స్ తో మెస్మరైజ్ చేశారు. ఇక నేపథ్య సంగీతంతో అయితే సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ కథలో ఎంత నిజాయితీ ఉందో.. రమేష్ కెమెరా పనితనం అంత సహజంగా ఉంది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా రైతుల ఆవేదనను కెమెరాలో చక్కగా బంధించారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన అనుభవంతో సినిమాని నీట్ గా ప్రజెంట్ చేశారు. అనిల్ అచ్చుగట్ల సంభాషణలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ ప్రాణం పెట్టి నటించారు. రైతు నాయకుడిగా వినోద్ కుమార్ నటన కట్టిపడేసింది. ఇప్పటిదాకా ఆయన పోషించిన ఉత్తమ పాత్రలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. రైతు నాయకురాలిగా వాణి విశ్వనాథ్ కూడా మెప్పించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటనకు ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ఇక రైతుల కోసం పోరాడే యువకుడి పాత్రలో అఖిలన్ నటన గుర్తుండిపోతుంది. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. వీణ, పవన్, విశాల్, షణ్ముఖ్, మధు, అజయ్ రత్నం, అంకిత ఠాకూర్ తదితరులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 'ఏరువాక' పాటలో అమృత చౌదరి నృత్యం ఆకట్టుకుంది.

ఫైనల్ గా..
వినోదాన్ని పంచే సినిమాలు రెగ్యులర్ గా వస్తాయి. కానీ వాస్తవాన్ని చూపిస్తూ ఆలోచన రేకెత్తించే సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన సినిమానే 'రాజధాని ఫైల్స్'. ఇది ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో చెందిన సినిమా కాదు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా.. అందరినీ కదిలించే రైతుల త్యాగానికి, వారి ఆవేదనకి సాక్ష్యం ఈ చిత్రం. 

రేటింగ్:
రైతుకి, భూమికి ఉన్న బంధానికి.. రైతు కన్నీళ్ళకి విలువ కట్టగలమా?.
రైతుల కన్నీళ్ళకి ఎలాగైతే విలువ కట్టాలేమో.. రైతుల కన్నీటి గాధను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాని కూడా రేటింగ్ పేరుతో తక్కువ చేయలేము.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.