![]() |
![]() |
ఫిబ్రవరి 14 వస్తోందంటే ప్రేమికులకు పండగే. కొందరు తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేస్తారు, ఆల్రెడీ ప్రేమలో మునిగితేలుతున్న జంట ఆరోజును ఒక స్పెషల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాలెంటైన్స్ డే అనగానే ఎన్నో జంటలు బయటి ప్రపంచంలోకి వచ్చి ప్రేమవిహారం చేస్తారు. కానీ, ఒక హీరో మాత్రం తన భగ్న ప్రేమను వాలెంటైన్ డే సందర్భంగా తెలియజేస్తున్నాడు. విజయ్ దేవరకొండ సోదరుడుగా ఆనంద్ దేవరకొండ అందరికీ పరిచయమే. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆనంద్‌ని విజయ్ దేవరకొండ తమ్ముడిగానే చూసారు తప్ప హీరోగా ఎవరూ పరిగణించలేదు. అయితే గత సంవత్సరం విడుదలైన ‘బేబి’ సినిమా అతన్ని హీరోగా నిలబెట్టింది. ఆ సినిమా సాధించిన విజయంతో కొత్తగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో అతను హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్‌లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. వాలెంటైన్స్ డే సమీపిస్తున్న నేపథ్యంలో తన భగ్న ప్రేమకథను అందరితో షేర్ చేసుకున్నాడు ఆనంద్ దేవరకొండ. తాను కూడా అందరిలాగే ప్రేమలో పడ్డానని, తను ప్రేమించిన అమ్మాయి కోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించానని చెబుతున్నాడు. తన ప్రియురాలు హయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లింది. ఆమెతోపాటు తాను కూడా యు.ఎస్. వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇద్దరూ ఒకేచోట చదువుకుంటే మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని భావించిన ఆనంద్.. చికాగోలోని టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజీల్లో అప్లయ్ చేశాడు. వాటిలో ఒక కాలేజీలో సీటు వచ్చింది. వెంటనే ఆ కాలేజీలో జాయిన్ అయిపోయాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాతే అసలు విషయం తెలిసింది ఆనంద్‌కి. తమ ప్రేమకు సంబంధించి కొన్ని వాస్తవాలు బయటికి వచ్చాయి. తన లవ్‌స్టోరీ బెడిసి కొట్టిందని తెలుసుకోవడానికి ఆనంద్‌కి ఎక్కువ రోజులు పట్టలేదు. ఆ విషయం తెలిసిన రోజు తన గుండె పగిలిందని ఎమోషనల్‌గా చెబుతున్నాడు. ఆ బ్రేకప్ బాధ నుంచి బయట పడేందుకు తనకు నాలుగేళ్ళు పట్టిందట. ఒక అమ్మాయిని నిజాయితీగా ప్రేమించినా బ్రేకప్ తప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జీవితంలో తనని ఎక్కువ బాధ పెట్టిన విషయం అదేనని, వ్యక్తిగతంగా తనను ఆ ఘటన కుంగదీసిందని గుర్తు చేసుకున్నాడు.
![]() |
![]() |