![]() |
![]() |

"నీకు నరికే కొద్దీ అలుపు వస్తుందేమో.. నాకు ఊపు వస్తుంది" అన్నట్టుగా.. "మీకు వయసు పెరిగే కొద్దీ రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుందేమో.. నాకు రికార్డులు సృష్టించాలి అనిపిస్తుంది" అంటున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం వేరే ఏ సీనియర్ స్టార్ లేనంత ఫామ్ లో బాలయ్య ఉన్నారు. 'అఖండ', ''వీరసింహారెడ్డి, 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. అలాగే 'అన్ స్టాపబుల్' షోతో కొత్తగా మరెందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలయ్య సినిమాలకు వస్తున్న వసూళ్లు, రోజురోజుకి ఆయనకు పెరుగుతున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. ఎన్నో బడా కంపెనీలు ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. నిర్మాతలు సైతం రూ.100 కోట్ల బడ్జెట్ కి తగ్గకుండా భారీ సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు.
ఈ జనరేషన్ లో టాలీవుడ్ లో ఎందరో టాప్ స్టార్స్ ఉన్నారు. కొందరు పాన్ ఇండియా స్టార్స్ గా కూడా అవతరించారు. అయినప్పటికీ రీజినల్ సినిమాలతోనే సంచలన వసూళ్లు సాధిస్తూ.. వరుస విజయాలతో ఈ తరం స్టార్స్ కి సవాల్ విసురుతున్నారు బాలయ్య. మధ్యలో కొన్నేళ్లపాటు కథల ఎంపికలో చేసిన పొరపాటు వల్ల పరాజయాలు ఎదుర్కొన్న బాలకృష్ణ.. నేలకి కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ వస్తున్నారు. ఈమధ్య కాలంలో బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా హిట్ అనే అభిప్రాయానికి ప్రేక్షకులు ముందే వచ్చేస్తున్నారు. అలాగే ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కనీసం రూ.70 కోట్ల షేర్ రాబడుతున్నాయి. ఆయన గత చిత్రాలు 'అఖండ', ''వీరసింహారెడ్డి, 'భగవంత్ కేసరి' మూడూ కూడా రూ.70 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. ప్రస్తుతం సీనియర్ స్టార్స్ లో హ్యాట్రిక్ రూ.70 కోట్ల షేర్ ఉన్న ఏకైక హీరో బాలయ్య కావడం విశేషం.
బాలయ్య కథల ఎంపిక, కన్సిస్టెన్సీ చూసి.. ఆయనతో సినిమాలు చేయడానికి ఎందరో నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్ల పైనే అంటున్నారు. డైరెక్టర్ ఎవరనే దానితో సంబంధం లేకుండా బాలయ్య సినిమాకి ప్రస్తుతం థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.100 నుంచి రూ.150 కోట్ల దాకా బిజినెస్ జరుగుతుందట. బాలకృష్ణ సినిమాలు థియేటర్లలో కనీసం రూ.70 కోట్ల షేర్ రాబడుతున్నాయి. ఓటీటీ, టీవీలలో కూడా ఆయన సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంది. అందుకే బాలయ్య సినిమాలకు ఆ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది అంటున్నారు. ఇలా సినిమా విడుదలకు ముందే భారీ ప్రాఫిట్స్ చూస్తుండటంతో.. బాలయ్య సినిమాకి 100 కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదట.
మరోవైపు బాలయ్య లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన మార్కెట్ మరింత పెరిగేలా ఉంది. బాబీతో సినిమా తర్వాత.. బోయపాటి శ్రీనుతో 'అఖండ-2'తో పాటు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ప్రస్తుతం బాలయ్య జోరు, ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే.. ఆయన డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే బాలకృష్ణ మార్కెట్ ఇతర సీనియర్ స్టార్స్ ఎవరూ టచ్ చేయలేని స్థాయికి చేరిపోతుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |