![]() |
![]() |
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 25 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో మహేష్ చేసిన సినిమాలు నంబర్ పరంగా తక్కువే అయినప్పటికీ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్‌లో ఉండాలనుకున్నాడు. ఆ దిశగానే అడుగులు వేస్తూ విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశాడు, చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో ఏ సినిమాకీ రానన్ని అప్‌డేట్స్, నెగెటివ్ టాక్, ట్రోలింగ్ అతని తాజాగా సినిమా ‘గుంటూరు కారం’కి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే యూనిట్‌లోని చాలా మంది సినిమా నుంచి తప్పుకోవడంతో నెగెటివ్ టాక్ మొదలైంది. ఆ తర్వాత తమన్ చేసిన పాటలు ప్రేక్షకులకు అంతగా రుచించకపోవడంతో అతనిపై ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. ‘కుర్చీని మడతపెట్టి..’ అనే సాంగ్ ‘గుంటూరు కారం’లో పెడుతున్నారని తెలిసి అందరూ షాక్ అయ్యారు. మహేష్ వంటి టాప్ హీరో సినిమాలో అలాంటి పాట పెట్టడం ఏంటని అందరూ విమర్శించారు.
ఇన్ని అవరోధాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. సినిమాపై ఎన్ని విమర్శలు ఉన్నా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలతోనే సంక్రాంతి బరిలో దిగిన ‘గుంటూరు కారం’ చిత్రానికి అనుకున్నట్టుగానే ఓపెనింగ్స్ విషయంలో దెబ్బపడిరది. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బీభత్సమైన విమర్శలు చేశారు. అయితే వాటన్నింటినీ తట్టుకొని సినిమా నిలబడిరది. నెమ్మదిగా కలెక్షన్లు పుంజుకున్నాయి. ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్ చాలా పెద్ద హిట్ అవ్వడంతో విమర్శించిన వారికి సరైన సమాధానం దొరికింది. ఈ పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడా పాట సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమని ఓ దశలో ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడ్డాయి. కానీ, దాన్ని కూడా అధిగమించింది ‘గుంటూరు కారం’.
థియేటర్లలో సందడి ముగిసిన తర్వాత ఫిబ్రవరి 9న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. ఓటీటీలో ఈ సినిమాకి అంత సీన్ ఉండదులే అనుకున్నారందరూ. కానీ, వారి అంచనాలను తారుమారు చేస్తూ ‘గుంటూరు కారం’ ఓటీటీలో దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్‌లో తెలుగు వెర్షన్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగులోనే కాదు, హిందీ, తమిళ వెర్షన్‌లకు కూడా చాలా పెద్ద రేంజ్‌లో వ్యూయర్‌షిప్ వస్తోంది. హిందీ వెర్షన్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది, తమిళ్ వెర్షన్ 5వ స్థానంలో ఉంది. ఎవరూ ఊహించనివిధంగా ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌కి అందరూ షాక్ అవుతున్నారు. దీంతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ‘మా బాబు పాన్ ఇండియా స్టార్..’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పండగ చేసుకుంటున్నారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్.
![]() |
![]() |