![]() |
![]() |

రాధ, శోభన, నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, మాళవిక మోహనన్ వంటి హీరోయిన్లు మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కి వచ్చి టాప్ హీరోయిన్లు అనిపించుకున్న విషయం తెలిసిందే. అందానికి మారుపేరు అనిపించుకునే మలయాళ హీరోయిన్లంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో మక్కువ. అందుకే వారిని ఆదరిస్తూ ఆనందిస్తుంటారు. అలా మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ అమ్మడి పేరు అన్నా బెన్. తెలుగులో ఎంట్రీ ఇచ్చేది ఓ చిన్న సినిమాతో కాదు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో.
సలార్ వంటి భారీ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘కల్కి 2898 ఎడి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమా భారీ తారాగణంతో రూపొందుతున్న విషయం తెలిసిందే. కమల్‌హాసన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే దీపికా పదుకొనే, దిశా పటాని, పశుపతి వంటి నోటెడ్ ఆర్టిస్టులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు మలయాళ హీరోయిన్ అన్నా బెన్ కూడా ఈ సినిమాలో భాగం అవుతోంది. ఈ విషయాన్ని అన్నా బెన్ స్వయంగా ప్రకటించింది.
మలయాళంలో అన్నా నటించిన కప్పేలా చిత్రాన్ని తెలుగులో బుట్టబొమ్మగా రీమేక్ చేశారు. అలాగే హెలెన్ మలయాళంలో చాలా పెద్ద హిట్ సినిమా. దీన్ని హిందీలో జాన్వీ కపూర్‌తో మిలి అనే పేరుతో రీమేక్ చేశారు. అలాగే కుంబలంగీ నైట్స్, త్రిశంకు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అడమెంట్ గర్ల్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. మలయాళంలో సెన్సేషనల్ హీరోయిన్ అయిన అన్నా బెన్ కల్కిలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అన్నా టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
![]() |
![]() |