![]() |
![]() |

'గుంటూరు కారం' చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉంటుందని ముందునుంచి ప్రచారం జరిగింది. ఆ మధ్య సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ కాగా, వాటిలో జనదళం పార్టీ నేతగా ప్రకాష్ రాజ్ కనిపించాడు. దీంతో 'గుంటూరు కారం'లో పొలిటికల్ టచ్ ఉండటంపై అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో కూడా మహేష్ బాబు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తి JDP అని రాసున్న పార్టీ కండువా వేసుకొని ఉన్నాడు. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించిన పవన్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రాబోయే ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాడు. కాగా జనసేన పార్టీని JSP అని, తెలుగుదేశం పార్టీ TDP అని సంబోధిస్తుంటారు. అయితే త్రివిక్రమ్ తన స్నేహితుడి కోసం.. ఆ రెండు పార్టీల పేర్లను(JSP+TDP) కలిపి 'JDP' అని పెట్టాడా అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం.. ఈ సినిమాలో ఏపీ అధికార పార్టీ వైసీపీపై సెటైర్లు ఉంటాయి అనడంలో సందేహం లేదు.
మరోవైపు 'గుంటూరు కారం'లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలను ముడిపెడుతూ కూడా సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ లెక్కన విడుదల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.
![]() |
![]() |