![]() |
![]() |
‘గుంటూరు కారం’తో సంక్రాంతికి సందడి చేసేందుకు మహేష్ సిద్ధమైపోయాడు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దాని వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయితే రాజమౌళి కాంబినేషన్‌లో మహేష్ చేయబోయే సినిమా పట్టాలెక్కుతుందనేది వారి ఆశ. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం నుంచి బయటికి వచ్చేసినట్టే. ఇక నెక్స్‌ట్ చేయబోయే సినిమా మూడ్‌లోకి వెళ్లబోతున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే మరో రెండు మూడేళ్ళు రాజమౌళి కాంపౌండ్‌లోనే ఉండిపోవాలి. దానికి మెంటల్‌గా ప్రిపేర్ అవుతున్నాడు మహేష్.
ఇక రాజమౌళి విషయానికి వస్తే.. మహేష్ తన ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యే టైమ్ కోసమే ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేశాడని అంటున్నారు. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. సినిమాను సెట్స్‌పైకి తెచ్చేందుకు రాజమౌళి తన ప్రయత్నాన్ని వేగవంతం చేశారు. ఈ సినిమాకి సంబంధించి అందిన ఫస్ట్ అప్‌డేట్.. ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా ఇస్లాన్ మహేష్ సరసన నటించబోతోంది. త్వరలోనే రెండో అప్‌డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేమిటంటే.. రాజమౌళి ముంబయి వెళ్ళేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కొందరు బాలీవుడ్ నటులు అవసరం అవుతారట. వారిని సంప్రదించేందుకే రాజమౌళి ముంబయి వెళుతున్నట్టు సమాచారం.
ఈ సినిమా ఏ జోనర్‌లో ఉండబోతుందనే విషయం సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేశారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని చెప్పుకున్నారు. హాలీవుడ్‌లో ఫేమస్ సిరీస్ అయిన ఇండియానా జోన్స్‌ను పోలి ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే దీన్ని రాజమౌళి కన్‌ఫర్మ్ చెయ్యాల్సి ఉంది. తన సినిమాలకు సంబంధించిన కాన్సెప్ట్ ఏమిటో మొదట్లోనే రివీల్ చేసే రాజమౌళి ఈ సినిమాకి కూడా అలాంటి క్లూ ఇస్తాడని ఆశిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో నటించే తారాగణానికి సంబంధించి వర్కవుట్ చేస్తున్నాడు. రాజమౌళి గత చిత్రాల కంటే మరింత రిచ్‌గా, గ్రాండ్‌గా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అంటేనే ఎక్కడా లేని హైప్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నటీనటులు నటిస్తారని తెలిస్తే.. సినిమాకి ఎలాంటి బజ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మహేష్ రేంజ్‌ని మార్చే దిశగా రాజమౌళి అడుగులు వేస్తున్నాడు. ప్రపంచ స్థాయి హీరోగా అతన్ని ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్‌ని, అతని క్యారెక్టర్‌ని డిజైన్ చేశారని తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన రాజమౌళి అంతకుమించి అన్నట్టుగా తన తదుపరి చిత్రాన్ని తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైపోయాడు. రాజమౌళి ప్రతి కదలికను ప్రపంచ సినిమా గమనిస్తోంది. హాలీవుడ్‌లోనూ రాజమౌళి సినిమాలపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇలాంటి సమయంలో మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఏ రేంజ్‌లో ఉండాలన్నదే ప్రస్తుతం చిత్ర యూనిట్‌లో చర్చ జరుగుతోంది. హాలీవుడ్ సినిమా తరహాలోనే ప్రపంచ స్థాయిలో మహేష్ సినిమాని రిలీజ్ చెయ్యాలన్న ప్లానింగ్‌లో రాజమౌళి ఉన్నాడని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. అది అసాధారణంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేష్‌కి ఒక కొత్త లుక్‌ని ఇచ్చేందుకు రాజమౌళి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.
![]() |
![]() |