![]() |
![]() |

2008 లో వచ్చిన 'నేనింతే' సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సినిమాలో హీరో రవితేజ దర్శకుడిగా తన మొదటి సినిమాని ఎంతో కష్టపడి రూపొందిస్తే, ఆ చిత్రాన్ని కొన్న ఫైనాన్సియర్ మాత్రం.. డైరెక్టర్ గా రవితేజ పేరు తీసేసి తన పేరు వేసుకుంటాడు. సరిగ్గా 15 ఏళ్ళ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఇంచుమించు ఇలాంటి సీనే రియల్ గా జరిగింది. సినిమా డైరెక్ట్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టి, దర్శకుడిగా కూడా తన పేరే వేసుకున్నాడు నిర్మాత. ఇంత దారుణం జరిగినా నోరు మెదిపే వాళ్లే కరువయ్యారు.
దర్శకుడు కావడం అంత తేలికైన విషయం కాదు. అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. ఎన్నో అవమానాలు పడాలి. ఒకవేళ అవకాశం వచ్చినా, కష్టపడి సినిమా తెరకెక్కించాక.. దర్శకుడిగా తన పేరు వేయకపోతే అది ఇంకా పెద్ద నరకం. టాలీవుడ్ లో నవీన్ మేడారం అనే యువ దర్శకుడు అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు.
.webp)
2021 లో కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మాతగా 'డెవిల్' అనే సినిమా ప్రకటన వచ్చింది. పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలను ఏర్పడ్డాయి. ఈ ఏడాది జూలైలో గ్లింప్స్ విడుదల కాగా, అప్పటికి దర్శకుడిగా నవీన్ పేరే ఉంది. గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో.. కళ్యాణ్ రామ్ తో కలిసి బిగ్ స్క్రీన్ పై నవీన్ మ్యాజిక్ చేయబోతున్నాడని అందరూ బలంగా నమ్మారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో.. డైరెక్టర్ నవీన్ పేరు తీసేసారు. ఆ తర్వాత నిర్మాత అభిషేక్ నామా.. దర్శకుడిగా కూడా తన పేరే వేసుకున్నాడు.
అభిషేక్ నామాకి వివాదాలు కొత్తకాదు. కొంతకాలంగా పలు వివాదాల్లో ఆయన పేరు వినిపిస్తోంది. అయితే ఇప్పుడిది చాలా పెద్ద విషయం. రెండేళ్లు కష్టపడి సినిమా రూపొందిన వ్యక్తిని పక్కన పెట్టి, దర్శకుడిగా తన పేరు వేసుకోవడం తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు. అది ఒక మనిషి కష్టాన్ని, కళని దోచుకోవడం అవుతుంది. ఇంత పెద్ద విషయం జరిగితే సినీ పరిశ్రమ నుంచి గానీ, హీరో కళ్యాణ్ రామ్ నుంచి గానీ సరైన స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద కుటుంబాలలో నందమూరి కుటుంబం ఒకటి. తప్పుని తప్పు అని నిర్మొహమాటంగా చెప్పే స్వభావం ఆ కుటుంబానిది. పైగా ఏకంగా తన చిత్ర దర్శకుడికే అన్యాయం జరిగితే, అతని తరపున బలంగా నిలబడి న్యాయం చేయాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. కానీ నవీన్ మేడారం విషయంలో కళ్యాణ్ రామ్ అంత బలంగా నిలబడలేదా అనే అనుమానం కలుగుతోంది. కళ్యాణ్ రామ్ తలచుకుంటే సినీ పెద్దలతో మాట్లాడి నవీన్ కి న్యాయం చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఎందుకనో ఆ పని చేయలేకపోయాడు. దీంతో దర్శకుడిగా అభిషేక్ పేరుతోనే 'డెవిల్' విడుదలవుతోంది.
మరి అసలు డెవిల్ సినిమా విషయంలో తెరవెనుక ఏం జరిగిందో?, నవీన్ మేడారం పేరు తీసేసి అభిషేక్ నామా పేరెందుకు వేసుకున్నాడో?, నవీన్ కి కళ్యాణ్ రామ్ ఎందుకు న్యాయం చేయలేకపోయాడో?.. ఇదంతా తెలియాలంటే డెవిల్ టీం నోరు విప్పాలి. లేదంటే లోగుట్టు పెరుమాళ్ల కెరుక అని మనం సర్ది చెప్పుకోవాలి.
![]() |
![]() |