![]() |
![]() |
శివాజీ.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు. గతంలో హీరోగా, సహాయనటుడిగా, కమెడియన్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, అందరి చేత శభాష్ అనిపించుకున్న శివాజీ ఇటీవల స్టార్ మా ఆధ్వర్యంలో జరిగిన బిగ్‌బాస్ సీజన్ 7 రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించారు. నటుడిగానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నితిన్, విజయ్ సేతుపతి, యశోసాగర్, ఆర్యన్ రాజేష్ వంటి హీరోలకు తొలిరోజుల్లో గాత్రం అందించి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు సొంత పార్టీ అయిన బిజెపిని విమర్శించారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు చేశారు. 2015 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని 48 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత బిజెపికి రాజీనామా చేశారు. ప్రజల పక్షాన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2016లో వచ్చిన ‘సీసా’ నటుడిగా శివాజీకి చివరి సినిమా. ఆ తర్వాత వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 7తో మరింత పాపులర్ అయ్యారు.
మొదట జెమిని టివిలో వీడియో ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన శివాజీ ఆ తర్వాత జెమినీ టీవీలోనే యాంకర్‌గా కొన్నాళ్ళు పనిచేశారు. 2000 సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పరదేశి’ చిత్రం కోసం నిర్వహించిన స్టార్ కాంటెస్ట్ 2000 అనే షోలో పాల్గొన్నారు. ఈ కాంటెస్ట్‌లో శివాజీ, నటి లయ రెండో స్థానంలో నిలవడంతో ఆ సినిమాలో వారికి అవకాశం రాలేదు. అయితే ఈ షో ద్వారా శివాజీ గురించి చాలా మందికి తెలిసింది. అలా నెమ్మదిగా అతనికి సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. అయితే 1997లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్’ చిత్రంలో మొదటిసారి నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి, ప్రేమంటే ఇదేరా, ఫిలింనగర్, యువరాజు వంటి సినిమాల్లో నటించి అప్పటికే మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ‘పరదేశి’ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కోసం స్టార్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో చాలా సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పటివరకు 70కి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో కనిపించిన శివాజీ సినిమా రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హీరో శివాజీకి శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.
![]() |
![]() |