Home  »  News  »  బాబాయ్‌ ఊసెత్తని అబ్బాయ్‌.. ఫైర్‌ అవుతున్న బాలయ్య అభిమానులు!

Updated : Dec 13, 2023

నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలుగు సినిమా ఉన్నంత కాలం అందరూ తలుచుకునే పేరు. చిరస్మరణీయుడు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్‌. అలాంటి మహానటుడి కుటుంబం నుంచి వచ్చిన ఎంతో మంది నటులు ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ను ఏలుతున్నారు. ఆ మహానుభావుడి అడుగు జాడల్లో తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళుతున్నారు. నందమూరి ఫ్యామిలీ అంటే ఒక క్రమశిక్షణ, ప్రేమ, ఆప్యాయత, అనుబంధం.. ఇలాంటి మాటలే వినిపిస్తాయి. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలోని వ్యక్తుల మధ్య అలాంటి అనుబంధాలు, ఆప్యాయతలు లేవనే విషయం వారు వివిధ సందర్భాల్లో ప్రవర్తించిన తీరు వల్ల సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమైపోతోంది. 

ఇటీవలి పరిణామాలను చూస్తే నందమూరి బాలకృష్ణకు, హరికృష్ణ కుమారులైన కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ల మధ్య రోజురోజుకీ దూరం పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారం జరగడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈమధ్య జరిగిన కొన్ని కార్యక్రమాల్లో నందమూరి కుటుంబ సభ్యులు ప్రవర్తించిన తీరు ఇలాంటి ప్రచారాలకు తావిస్తోంది. నందమూరి తారకరత్న సంతాప సభలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లను కావాలనే బాలకృష్ణ పట్టించుకోలేదనే విషయం ఒక వీడియో ద్వారా అందరికీ అర్థమైంది.  ఆ వీడియో ఎంతో వైరల్‌ అయింది. దాన్ని చూసిన ఎన్టీఆర్‌ అభిమానులు బాలకృష్ణపై మండి పడ్డారు. అలాగే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం జరిగింది హైదరాబాద్‌లోనే అయినా కావాలనే శతజయంతి కార్యక్రమాన్ని ఎవాయిడ్‌ చేశారని ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లను బాలకృష్ణ అభిమానులు విమర్శించారు. 

ఆమధ్య చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకి పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. అక్రమ అరెస్టు అంటూ అందరూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కానీ, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఈ విషయంలో పెదవి విప్పలేదు. ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరిగినా, నెటిజన్లు చంద్రబాబు విషయాన్ని పదే పదే తీసుకొచ్చినా ఎన్టీఆర్‌ మౌనంగానే ఉన్నాడు. మరోసారి బాలకృష్ణ అభిమానులు, టీడీపీ వర్గాలు ఎన్టీఆర్‌ను తప్పుబట్టారు. బాలకృష్ణ విషయంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ప్రవర్తన అలా ఉంటే.. బాలకృష్ణ తీరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ఆమధ్య జరిగిన ఓ విలేకరుల సమావేశంలో చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్‌ స్పందించలేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ దీనిపై మీ స్పందన ఏమిటి అని అడగ్గా ‘వాడా.. బ్రో ఐ డోంట్‌ కేర్‌’ అంటూ సమాధానం ఇచ్చారు. ఆ సోదరులపై బాలకృష్ణ స్పందించిన తీరుకు బాలయ్య అభిమానులు కాలర్‌ ఎగరేయగా, ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రం కారాలు మిరియాలు నూరారు. 

ఇలాంటి ఘటనలు నందమూరి కుటుంబంలో తరచూ జరుగుతుండడంతో బాబాయ్‌, అబ్బాయిల మధ్య దూరం బాగా పెరిగిపోయిందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ విషయానికి మరింత ఊతం ఇస్తున్నట్టుగా ఇటీవల జరిగిన ‘డెవిల్‌’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో హీరో కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ తన సినిమాకి సంబంధించిన వివరాలతోపాటు తమ్ముడు ఎన్టీఆర్‌ సినిమా ‘దేవర’ గురించి కూడా కొన్ని అప్‌డేట్స్‌ ఇచ్చాడు. తన స్పీచ్‌ ముగిస్తూ జై ఎన్టీఆర్‌, జైజై ఎన్టీఆర్‌, జై హరికృష్ణ.. అంటూ నినాదాలు చేశాడు. కానీ, జై బాలయ్య అని మాత్రం కళ్యాణ్‌రామ్‌ అనలేదు. అయితే కల్యాణ్‌రామ్‌ కంటే ముందు దర్శకనిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ ‘జైబాలయ్య’ అంటూనే తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆయన అలా అనగానే కల్యాణ్‌రామ్‌ నవ్వాడు. కానీ, ఆ తర్వాత తన స్పీచ్‌లో మాత్రం బాలయ్య పేరును కూడా ప్రస్తావించలేదు. వారి కుటుంబంలో ఎవరెవరి మధ్య ఎంత దూరం ఉన్నా ఇలాంటి పబ్లిక్‌ ఫంక్షన్లలో మహానటుడు ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుమారుడు బాలకృష్ణ పేరును కూడా ప్రస్తావించడం సర్వసాధారణం. కానీ, కల్యాణ్‌రామ్‌ ఆ విషయాన్ని విస్మరించి బాలయ్య పేరును ఒక్కసారి కూడా తీసుకు రాకపోవడంతో బాలయ్య అభిమానులు కళ్యాణ్‌రామ్‌పై గుర్రుగా ఉన్నారని సమాచారం. నందమూరి హీరోల మధ్య దూరం పెరుగుతోంది అనే ప్రచారానికి వివిధ సందర్భాల్లో వారి ప్రవర్తన కూడా బలం చేకూరుస్తుండడంతో అది నిజమేనన్న అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.