![]() |
![]() |

మిచౌంగ్ తుపాన్ తమిళనాడు రాష్ట్రాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా చెన్నై నగరం పూర్తిగా జలమయం అయిపోయింది. భారీ వర్షాల కారణంగా ఎందరో వరదల్లో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలా సాయం కోసం ఎదురుచూస్తున్న వారిలో తమిళ హీరో విష్ణు విశాల్ కూడా ఉన్నాడు.
తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో బాగా వరద పెరిగిపోతోందని, తనతో పాటు ఎందరో సాయం కోసం ఎదురుచూస్తున్నామని విష్ణు విశాల్ తాజాగా ట్వీట్ చేశాడు. "నా ఇంట్లోకి నీరు చేరుతోంది మరియు కరపాక్కంలో నీటి మట్టం దారుణంగా పెరుగుతోంది. నేను సహాయం కోరాను. ఇక్కడ కరెంటు లేదు, వైఫై లేదు.. ఫోన్ సిగ్నల్ కూడా లేదు. టెర్రస్ మీద ఒక చోట మాత్రమే నాకు కొంత సిగ్నల్ వస్తుంది. ఈ ప్రాంతంలో నాతో ఉన్న చాలా మందికి సహాయం అందుతుందని ఆశిద్దాం." అని రాసుకొచ్చిన విష్ణు విశాల్ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అధైర్య పడకుండా జాగ్రత్తగా ఉండాలని విష్ణు విశాల్ కి అభిమానులు సూచిస్తున్నారు.

విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతేడాది 'మట్టి కుస్తీ'తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సంక్రాంతికి 'లాల్ సలామ్' చిత్రంతో పలకరించనున్నాడు.
![]() |
![]() |