![]() |
![]() |

అక్కినేని కాంపౌండ్ కి చెందిన హీరో సుమంత్ తాజాగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అసలు సుమంత్.. స్వరూపానంద స్వామిని ఎందుకు కలిశాడనే చర్చ నడుస్తోంది. అయితే ఆయన తన సినిమా టైటిల్ విడుదల కోసం కలవడం విశేషం.
రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతోన్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారైంది. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో 'మహేంద్రగిరి వారాహి' అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ మేరకు హీరో సుమంత్, హీరోయిన్ మీనాక్షి, దర్శకుడు జాగర్లపూడి సంతోష్, నిర్మాతలు కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి తదితరులు మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకుడు జాగర్లపూడి సంతోష్ తెలిపాడు. రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఆలయం విశాఖ శారదాపీఠంలోనే ఉన్నందున అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడకు వచ్చామని అన్నాడు. ఈ ఏడాది జూన్ నెలలో షూటింగ్ ప్రారంభమైందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పాడు.
![]() |
![]() |