![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఆయన.. తన తదుపరి సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. 'NBK 109'ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సితార.. ఈ సినిమా కోసం 'పుష్ప', 'జైలర్' టెక్నీషియన్స్ రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య గత మూడు చిత్రాలకు థమన్ సంగీతం అందించగా.. 'NBK 109' కోసం మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకున్నారట. 'పుష్ప-1' పాటలతో దేవి పేరు నేషనల్ వైడ్ గా మారుమోగిపోయింది. దీంతో 'పుష్ప-2' పాటల కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు 'NBK 109' కోసం డీఎస్పీ రంగంలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. గతంలో బాలయ్య-దేవి కాంబినేషన్ లో 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అలాగే 'సర్దార్ గబ్బర్ సింగ్', 'జై లవ కుశ', 'వాల్తేరు వీరయ్య' తర్వాత బాలయ్య-దేవి కాంబోలో రానున్న నాలుగో చిత్రమిది. మరి ఈ సినిమాతో డీఎస్పీ మరోసారి తన సంగీతంతో సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి.
'NBK 109' కోసం 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన జైలర్ సంచలన విజయాన్ని సాధించింది. సినిమా సినిమాకి తన ప్రతిభను నిరూపించుకుంటూ కోలీవుడ్ లో టాప్ డీఓపీలలో ఒకడిగా ఎదుగుతున్న విజయ్ కార్తీక్ కి.. జైలర్ మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు 'NBK 109' అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. 'రావణాసుర' తర్వాత తెలుగులో ఆయన పనిచేస్తున్న రెండో చిత్రమిది.
అసలే హ్యాట్రిక్ విజయాలతో బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. దానికి తోడు ఫామ్ లో ఉన్న బడా టెక్నీషియన్స్ తోడయ్యారు. ఈ లెక్కన 'NBK 109' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని బాలయ్య అభిమానులు అప్పుడే లెక్కలు మొదలుపెట్టారు.
![]() |
![]() |