![]() |
![]() |
ఇటీవల హీరో విశ్వక్ సేన్ తన కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో రచ్చ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9కి రిలీజ్ కావాల్సిన తన సినిమాను వాయిదా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అతను పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరు నూరైనా అనుకున్న డేట్‌కి తన సినిమా రావాల్సిందే అని, డేట్ మారిస్తే ప్రమోషన్లకు కూడా రాను అనే హింట్ ఇచ్చాడు. తన సినిమా డేట్ మార్చుకునేలా ఇండస్ట్రీలో కొందరు ఒత్తిడి తెస్తున్నారని అభిప్రాయపడ్డాడు. విశ్వక్‌సేన్ అనుకుంటున్నట్టుగానే నిర్మాత నాగవంశీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాడా అని అందరూ అనుకున్నారు. దీని గురించి నాగవంశీ ఏం మాట్లాడతాడా అని అందరూ ఎదురుచూశారు.
నాగవంశీ బేనర్‌లోనే నిర్మిస్తున్న మరో చిత్రం ‘ఆదికేశవ’ను నవంబర్ 10 నుంచి 24కు వాయిదా వేస్తున్న విషయాన్ని తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విశ్వక్‌సేన్ పెట్టిన పోస్టు గురించి కూడా మాట్లాడాడు. తను హీరోగా చేసిన సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిరదంటే ఏ హీరో అయినా బాధపడతాడని, ‘ఆదికేశవ’ విషయంలో వైష్ణవ్ కూడా ఫీల్ అయ్యాడని, విశ్వక్ ఆవేదన కూడా కరెక్టేనని అన్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఒక పాటతోపాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని, అవి పూర్తయిన తర్వాతే సినిమా రిలీజ్ విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. డిసెంబరు రెండో వారంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’తో పాటు తమ సినిమా మాత్రమే రిలీజ్ అవుతుంది అనుకున్నా. ‘సలార్’ డిసెంబర్ 22 రిలీజ్ అని ఎనౌన్స్ చేయడంతో హాయ్ నాన్న, ఎక్స్‌ట్రా సినిమాలు ప్రీపోన్ కావడంతో ఇబ్బంది వచ్చింది. కొన్ని సార్లు సినిమా రిలీజ్ విషయాల్లో సర్దుబాటు అవసరమని అన్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 29కి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నామని, అది మంచి డేట్ అవుతుందని నాగవంశీ అన్నారు.
![]() |
![]() |