![]() |
![]() |

ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన విలువైన కారు చోరీకి గురైంది. చోరీకి గురైన కాసేపటికే పోలీసులు రంగంలోకి దిగి, ఆ కారు దొంగని పట్టుకున్నారు. అయితే ఆ కారు దొంగ తనని తాను అంబానీ పీఏగా పరిచయం చేసుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.
అర్చిత్ రెడ్డి శుక్రవారం నాడు కోటిన్నర విలువల గల కారులో ఓ హోటల్ కు వెళ్లాడు. హోటల్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్లిన ఆయన.. కాసేపటికి బయటకు వచ్చి చూడగా కారు కనిపించలేదు. దీంతో ఆయన వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడ పోలీసులు కారును ఆపి, ఆ కారుని తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి చెప్పిన సమాధానాలు విని పోలీసులు షాకయ్యారట. మొదట తాను అంబానీ పీఏ అని చెప్పాడట. ఆ తర్వాత హృతిక్ రోషన్ నా పీఏ అని అన్నాడట. ఆ తర్వాత ఏమో మంత్రిని పిక్ చేసుకోవడం కోసం కారు తీసుకెళ్తున్నా అని చెప్పాడట. అతని సమాధానాలు విని తలలు పట్టుకున్న పోలీసులు.. అతని కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ తీసుకొని, వారికి ఫోన్ చేయగా అసలు విషయం తెలిసిందట. అతనికి మతిస్థిమితం లేదని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారట. దీంతో ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులకి అప్పగించిన పోలీసులు.. కారుని అర్చిత్ రెడ్డికి అప్పగించారట.
![]() |
![]() |