![]() |
![]() |
ఇప్పుడు ఒక భాషలో సినిమా తీశారంటే ఎన్ని భాషల్లోనైనా డబ్బింగ్ చేసేసి పాన్ ఇండియా మూవీగా చెప్పేసి రిలీజ్ చేసెయ్యొచ్చు. ఈమధ్యకాలం వరకు కూడా ఏ భాష నుంచి అయినా తెలుగులోకి సినిమాని డబ్ చేస్తే టైటిల్‌తో సహా అన్నీ తెలుగులో ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ, తమిళ్ నిర్మాతల ధోరణి వేరేలా ఉంది. కొన్ని తమిళ సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తూ కనీసం టైటిల్ కూడా మార్చకుండా తమిళ్ టైటిల్‌నే ఉంచేస్తున్నారు. ఇది తెలుగు వారిని అవమానించడమే అవుతుంది. కేవలం తమిళ భాషని ప్రమోట్ చేసుకోవడానికి అన్నట్టు టైటిల్ మార్చకుండా తెలుగులో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్?
శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కూడా అజిత్ సినిమా వలిమై, కంగనా రౌనత్ సినిమా తలైవి చిత్రాల పేర్లను అలాగే వుంచేసి రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని ప్రస్తుతం తమిళ్‌లో చేస్తున్న రత్తం కూడా అదే టైటిల్‌తో రాబోతోంది. మేం టైటిల్ తమిళ్‌దే ఉంచుతాం. మీరు ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు అనే ధోరణి వారి ప్రవర్తనలో కనిపిస్తోంది. ఈ విషయంలో దర్శకనిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకున్నా హీరోలైనా కల్పించుకొని తెలుగు భాషను గౌరవించాలి. ఇప్పటికే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. దీన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
![]() |
![]() |